ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి పాలన

1 గంట క్రితం

savita
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 09:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బిసిల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే లక్ష్యం

- మంత్రులు సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, బిసిలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలో నిలబెట్టడమే లక్ష్యమని మంత్రులు ఎస్‌.సవిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం రాష్ట్రస్థాయి జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తొలుత లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 1909 ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా బారువలో జన్మించిన గౌతు లచ్చన్న 21వ ఏటనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, అణగారిన వర్గాలు, బిసిలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. గౌతు లచ్చన్న ఆశయాల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత అన్నారు. బిసిల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బిసిలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం గౌతు లచ్చన్న అనేక ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. రైతుల కోసం శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు సుమారు 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత ఆయనదేనన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ఆయన ధైర్యంగా పోరాడారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు బిసిలు హత్యలకు గురయ్యారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిలను అక్కున చేర్చుకుని, వారి విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న స్ఫూర్తితో ముఖ్యమంత్రి బిసిలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో బిసి రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు బిసి యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. కేవలం పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే కాకుండా బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని తెలిపారు. బీసీ యువత తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు పురస్కారాలు

అనగాని సత్యప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన 125 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం రూ.25 లక్షల నగదు పురస్కారాలు అందజేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, బిసి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, బిసి సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్