శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ నిర్వాసితులు, సిపిఎం నాయకులపై నిర్బందం తగదు

1 గంట క్రితం

Statewide 'Chalo Collectorate' on August 24 for graveyards: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 07:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వెలిగొండ సాధన కమ్యూనిస్టుల పోరాట ఫలితమే: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయవాడ : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాసితులను, సిపిఎం నాయకులను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ నెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో, నిర్వాసితుల్లో నిర్లక్ష్యానికి గురైన 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులను, ఇప్పటివరకు నిర్వాసితులకు అండగా నిలిచిన సిపిఎం జిల్లా నాయకులను బైండోవర్ పేరుతో పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.

30 సంవత్సరాలుగా వెలిగొండ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టు పార్టీలు నిరంతరంగా పోరాడుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. 1996లో సిపిఎం, సీపీఐ రాష్ట్ర నాయకుల ఒత్తిడి మేరకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు అంగీకరించారని గుర్తుచేశారు. ఆ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు కొరటాల సత్యనారాయణ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే శంకుస్థాపన అనంతరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని, ప్రజలను సమీకరించి సిపిఎం, సిపిఐతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మాజీ ఇంజినీర్లు అనేక ఉద్యమాలు నిర్వహించారని ఆయన తెలిపారు. పాదయాత్రలు చేపట్టడంతో పాటు, పనులు నిలిచిపోయిన ప్రతిసారీ రాష్ట్ర నాయకులు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని వివరించారు. ప్రాజెక్టు కోసం ఇంతకాలం పోరాడిన పార్టీని నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసినందుకు నిర్బంధించడం అప్రజాస్వామికమని శ్రీనివాసరావు అన్నారు. ప్రాజెక్టులో నీటిని విడుదల చేయడానికి ముందే నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ చెల్లించాలని నిర్వాసితుల సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని తెలిపారు. ఈ ఉద్యమాల అనంతరమే ప్రభుత్వం నిధులు విడుదల చేయక తప్పలేదన్నారు.

నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా ఉద్యమాల కారణంగా విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం నిర్వాసితుల్లో ఎక్కువమందికి పరిహారం అందిందంటే దానికి వారి పోరాటాలే ప్రధాన కారణమని అన్నారు. అయితే ఇప్పటికీ 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు 2019 ప్యాకేజీని అమలు చేయకుండా కేవలం రూ.2 లక్షలతో సరిపెట్టడం అన్యాయమని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించిన ఆయన, ఇప్పటికైనా నిర్బంధాలను నిలిపివేసి, 31న జరగనున్న వెలిగొండ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్