శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జిజిహెచ్ లో వైద్య సేవలు మెరుగు పరచాలి : సిపిఎం

1 గంట క్రితం

WhatsApp Image 2026-08-29 at 5.14.31 PM.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 05:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ సహా ఆసుపత్రి అభివృద్ధి మండలి సభ్యులకు వినతి పత్రాలు అందజేత

  • సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, ఎంపీలు

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగు పరచాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరీంధర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లతో పాటు ఆసుపత్రి అభివృద్ధి మండలి సభ్యులందరికీ వినతి పత్రాలు సమర్పించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు తో పాటు మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ బృందం 18 అంశాలతో కూడిన సూచనలు, సలహాలను అధికారులకు వినతి పత్రాల ద్వారా సమర్పించారు.

CPM team submitting a petition to MLA Kondababu

ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా సేవలందిస్తున్నది కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అని కొనియాడారు. అధికారికంగా 1155 పడకలు గల ఈ ఆస్పత్రిలో ప్రతినిత్యం సుమారు 2000 మంది ఇన్, 3000 మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారని తెలిపారు. పడకల స్థాయిని కనీసం 2500 కైనా పెంచాలన్నారు. ఆసుపత్రికి సరిపడా వీల్ చైర్స్ , స్ట్రెచర్స్ ఏర్పాటు చేయాలన్నారు. టిబి బ్లాక్ ప్రాంగణంలో నూతన ఓపి బ్లాక్ నిర్మాణం ప్రతిపాదన మరొకసారి పరిశీలించాలన్నారు. ప్రధాన ఆసుపత్రికి దూరంగానే టిబి బ్లాకు ఉండాలని, ఓపి బ్లాక్ ప్రధాన ఆసుపత్రిలోనే ఉండాలన్నారు. రోగుల అటెండెంట్ లకు షెల్ఫులు ఏర్పాటు చేయాలని, తగిన పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం చేయాలని, వేచి ఉండే షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ తదితర థర్డ్ పార్టీ కాంటాక్ట్ వర్కర్స్ కి ప్రతి నెలా 1 వ తేదీన జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలపై సూపరింటెండెంట్ వారు గాని, అడ్మినిస్ట్రేటర్ వారు గాని సానుకూలంగా స్పందించాలన్నారు. రక్త పరీక్షల రిజిస్ట్రేషన్, శాంపిల్ కలెక్షన్ ఒకే చోట ఉండాలన్నారు. 2021లో తొలగించిన ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం విధుల్లోకి తీసుకోవడం వల్ల కొంతవరకు సిబ్బంది కొరతను అధిగమించవచ్చన్నారు. ఆసుపత్రిలో పార్కింగ్ ను క్రమబద్ధీకరించాలని, గుంతలు లేకుండా రోడ్లు నిర్మించాలని కోరుతున్నామన్నారు. సిటీ స్కాన్ కూడా క్యాజువాలిటీ బ్లాక్ లోనే ఏర్పాటు చేయాలన్నారు. క్యాజువాలిటీని మరింతగా విస్తరించాలని, మధ్యాహ్నం రాత్రి షిఫ్ట్ లలో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉంచాలని ఎఫ్ ఎన్ ఓ, ఎం ఎన్ ఓ తదితర సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరుతున్నామన్నారు. కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ వైద్యుల నియామకం కొరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

సిపిఎం బృందం వినతిపత్రం ఇవ్వగానే సిటీ ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించి భవిష్యత్తులో ముందుగానే తెలియజేయాలని కోరారు. ఎంపీ ఉదయ శ్రీనివాస్ వినతిపత్రాన్ని అంశాలవారీగా అడిగి తెలుసుకుని సమావేశంలో చర్చిస్తామని నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు, అధికారులు, హెచ్.డి.ఎస్. సభ్యులు సిపిఎం కృషిని అభినందించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్