శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆస్తులు, అప్పుల విభజన పూర్తి చేయండి

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఉద్యోగుల బకాయిలు 8 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే..

  • కేంద్రానికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్తులు, అప్పుల పంపిణీపై వివాదాలు పరిష్కారం కాలేదన్న కారణంతో ఉద్యోగుల ఉద్యోగ విరమణ ప్రయోజనాలను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవి కావని, సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగులు సంపాదించుకున్న హక్కులని పేర్కొంది. ముఖ్యంగా ఉద్యోగుల వేతనాల నుంచి క్రమం తప్పకుండా మినహాయించి జమ చేసే జిపిఎఫ్‌ సొమ్ము విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. పరిపాలనాపరమైన జాప్యాలు, సంస్థల మధ్య వివాదాలకు ఉద్యోగులు బాధితులు కాకూడదని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డులో పనిచేసిన ఉద్యోగులకు సంబంధించిన సుమారు రూ.8.77 కోట్ల జిపిఎఫ్‌ నిధులు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఆధీనంలో ఉన్నందున, పిటిషనర్లకు రావాల్సిన బకాయిలను వడ్డీతో కలిపి ఎనిమిది వారాల్లో చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశించారు. గడువులోగా చెల్లించకపోతే ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తేదీ నుంచి చెల్లింపు వరకు 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

2014 ఎపి పునర్విభజన చట్టం నేపథ్యంలో ఉమ్మడి హౌసింగ్‌ బోర్డు ఎపి, తెలంగాణ బోర్డులుగా విడిపోయింది. ఉమ్మడి బోర్డులో సుమారు 40 ఏళ్లపాటు పనిచేసిన పలువురు ఉద్యోగులు విభజన తర్వాత ఎపి హౌసింగ్‌ బోర్డులో సేవలు కొనసాగించి, 2018-21 మధ్య ఉద్యోగ విరమణ చేశారు. ఎపి బోర్డులో పనిచేసిన కాలానికి సంబంధించిన ప్రయోజనాలు అందుకున్నప్పటికీ, విభజనకు ముందు వారి వేతనాల నుంచి మినహాయించిన జిపిఎఫ్‌ సొమ్ము తెలంగాణ బోర్డు పరిధిలోనే ఉండిపోయింది. బకాయిలు చెల్లించకపోవడంతో మధుసూదనరావు, వి స్వర్ణకుమారి, టి రామ్‌గోపాల్‌రెడ్డి, కె ధర్మానందరెడ్డి, ఎ విజయశేఖరరెడ్డి తదితరులు 2021-22లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది తేలప్రోలు శ్రీచరణ్‌, ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇవప సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపించారు. జిపిఎఫ్‌ నిధులను బదిలీ చేయాలని తెలంగాణ బోర్డును పలుమార్లు కోరినా స్పందించలేదని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పిటిషనర్లు ఎపిలో పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ చేసినందున చెల్లింపుల బాధ్యత తమపై లేదని తెలంగాణ బోర్డు వాదించింది. అమికస్‌ క్యూరీ పదిరి రవితేజ మాత్రం ఉమ్మడి బోర్డు ఆదాయంలో 96 శాతం సమకూర్చే ఆస్తులను తెలంగాణ బోర్డు అనుభవిస్తున్నందున, వాటికి సంబంధించిన అప్పుల బాధ్యతను కూడా అదే సంస్థ భరించాలనే సూత్రం వర్తిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు చెల్లించే జిపిఎఫ్‌ మొత్తాలను ఇరు రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య భవిష్యత్తులో జరిగే ఆస్తులు, అప్పుల పంపిణీలో సర్దుబాటు చేసుకోవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్