శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించింది

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • న్యాయమూర్తుల నియామకాల్లో గత 12 ఏళ్లుగా అనుచిత జోక్యం

  • మాజీ న్యాయమూర్తి మురళీధర్ ఆగ్రహం

​న్యూఢిల్లీ : కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని సీనియర్ న్యాయవాది, మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఎస్. మురళీధర్ విమర్శించారు. ఇటీవల న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసి)లో జరిగిన 28వ డిఎస్ బోర్కర్ స్మారక ఉపన్యాసంలో ( ‘విజన్ ఆఫ్ ఇండియా 2047’ ) మురళీధర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పన్నెండేళ్లుగా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం తరపున ఎలాంటి వివరణ లేని జోక్యం చోటుచేసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. 1993లో ప్రవేశపెట్టిన కొలీజియం వ్యవస్థ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుందని, అయినప్పటికీ ఈ వ్యవస్థ ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోతుందనే అభిప్రాయం ఇప్పుడు విస్తృతమవుతుందని మురళీధర్ తెలిపారు.

నియామక ప్రక్రియలో స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం, పారదర్శకత కొరవడటం, మొత్తంమీద అసమర్థత దీనికి తోడయ్యాయని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తుల పదవీ విరమణ తేదీలు ముందుగానే బహిరంగంగా తెలిసినప్పటికీ, సకాలంలో ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంలో కొలీజియం వ్యవస్థ విఫలమవుతోందని ఆయన ఎత్తిచూపారు. నియామక ప్రక్రియను సమర్థవంతంగా మార్చకుండా కేవలం న్యాయమూర్తుల మంజూరు సంఖ్యను పెంచడం వల్ల ఖాళీల సంక్షోభం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.

​న్యాయమూర్తులను తప్పుపట్టలేం..

కేసుల పరిష్కారంలో జాప్యం, పెరుగుతున్న పెండింగ్ కేసులపై కూడా మురళీధర్ మాట్లాడారు. న్యాయమూర్తులు తమ శాయశక్తులా కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. కేసుల పరిష్కార రేటు ( సిసిఆర్‌) 90 శాతానికిపైగా ఉందని, న్యాయమూర్తుల్లో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు ఉన్నప్పటికీ, చాలామంది శ్రద్ధగా, కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పెండింగ్ కేసులకు కారణమెవరో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని మురళీధర్ అన్నారు. ప్రతి నెలా జిల్లా స్థాయిలో సుమారు 29 లక్షల కేసులు నమోదవుతుండగా, న్యాయమూర్తులు 24 లక్షల కేసులను పరిష్కరిస్తున్నారని తెలిపారు. హైకోర్టుల్లో ఏటా 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా, దాదాపు అంతే సంఖ్యలో పరిష్కారమవుతున్నాయని, దీంతో మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య దాదాపు స్థిరంగా ఉంటోందని వివరించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 93 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా, 2025లో 62 వేల కేసులు నమోదవగా, 57 వేల కేసులు పరిష్కారమయ్యాయని ఆయన గణాంకాలు వెల్లడించారు.

​కేసుల భారానికి ప్రభుత్వాలదే ప్రధాన బాధ్యత

శాంతియుత నిరసనలు వంటి సాధారణ ప్రజాస్వామిక కార్యకలాపాలను నేరపూరితం చేయడం వంటి "ఏకపక్ష నిర్ణయాల" ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులపై భారాన్ని పెంచుతున్నాయని మురళీధర్ విమర్శించారు. ప్రభుత్వాల నిర్ణయాలు, నిర్ణయం తీసుకోకపోవడం, అనవసర అరెస్టుల వల్ల ప్రజలు కోర్టులను ఆశ్రయించక తప్పడం లేదని, అందుకే జాప్యాలు, ఖర్చులు, అనిశ్చితి ఉన్నప్పటికీ కేసుల నమోదు పెరుగుతూనే ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరపు న్యాయవాదులు పదేపదే వాయిదాలు కోరడం, సరైన సూచనలు అందించకపోవడం వల్ల కూడా కేసుల్లో జాప్యం జరుగుతోందని మురళీధర్ అభిప్రాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్