శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేపాల్‌ యంత్రాంగానికి తీవ్ర సవాళ్ళు

8 నిమిషాల క్రితం

nepal2-1788012097942-2451.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కిక్కిరిసిన శవాగారాలు, కుళ్లిపోతున్న మృతదేహాలు !

  • 620కి పెరిగిన మృతులు, 2400 మందికి పైగా గల్లంతు

  • కానరాని 320 మంది భారతీయుల ఆచూకీ

ఖాట్మండు : నేపాల్‌‌లో సంభవించిన మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఒకపక్క మృతుల సంఖ్య పెరుగుతునే వుంది. వేలల్లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా బయటపడలేదు. మరోపక్క శవాగారాలు నిండిపోవడంతో మృత దేహాలు కుళ్ళిపోకుండా వారి కుటుంబాలు గుర్తుపట్టేవరకు కాపాడటమనేది అధికారులకు తలకు మించిన భారమవుతోంది. ఈ విపత్తు సృష్టించిన రెండో సంక్షోభంలా వుంది. కాగా, భోటీకోశి నది ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల వద్ద బయటపడు తుండడంతో నేపాల్‌ ‌వ్యాప్తంగా గల్లంతైన వారి ఫోటోలు పట్టుకుని వారి కుటుంబ సభ్యులు చిత్వాన్‌ ‌చేరుకుంటున్నారు. అనేక జిల్లాల్లో శవాగారాలు నిండిపోవడంతో పొరుగు ప్రాంతాలకు వాటిని తరలించడంపై దృష్టి పెడుతున్నారు. అక్కడ అవసరమైన సదుపాయాలు కల్పించడం తీవ్ర సవాళ్ళుగా మారుతున్నాయని ఖాట్మండు పోస్ట్‌ ‌పేర్కొంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని భారత్‌ ‌కూడా నిశితంగా గమనిస్తునే వుంది. ఇప్పటికీ 320మంది భారతీయుల ఆచూకీ తెలియరాలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. తమ వారి కోసం కుటుంబాల వేదన, శవాగారాలపై పడుతున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో మృతదేహాల గాలింపు చర్యలను వేగిరపరచరాల్సిన అవసరం పెరుగుతోంది.

620కి పెరిగిన మృతులు

ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 620కి పెరిగిందని నేపాల్‌ ‌పోలీసుల శనివారం తెలిపారు. కాగా ఇప్పటికీ 2400మందికి పైగా గల్లంతయ్యారు, వారి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. వరద బాధిత ప్రాంతాల్లో భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ శనివారం హెచ్చరించిన నేపథ్యంలో సహాయక చర్యలు ఆటంకం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. టిబెట్‌ ‌వైపు ఏడుగురు మరణించారని అంతకుముందు చైనా ప్రభుత్వమీడియా ధృవీకరించింది. అలాగే వరదల కారణంగా కృత్రిమంగా ఏర్పడిన సరస్సు బద్దలయ్యే ముప్ప క్రమేపీ తగ్గుతూ వస్తోందని కూడా చైనా అధికారులు వెల్లడించారు. కాగా వరదల కారణంగా దాదాపు 2500మంది చిక్కుకుపోయారు. వారిలో 163మంది విదేశీయులు వున్నారు. వీరందరినీ నేపాల్‌‌లో సహాయక బృందాలు అక్కడ నుండి తరలిస్తున్నాయి. వరుసగా నాల్గవ రోజు కూడా గాలింపు, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. జల విద్యుత్‌ ‌ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన వందమందిని పైగా కాపాడేందుకు డ్రిల్లింగ్‌ ‌పరకరాలను నేపాల్‌ ఆర్మీ ఉపయోగిస్తోంది. మూడు రోజుల నుండి త్రిశూలి 3ఎ జల విద్యుత్‌ ‌ప్రాజెక్టు సొరంగంలో వీరు చిక్కుకుపోయారు. శనివారం ఉదయం నుండి ఈ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. చైనా ఇందుకోసం ఐదుగురు నిపుణులను పంపించింది. వరదల కారణంగా విధ్వంసం జరిగినప్రాంతాల్లో పునర్మిర్మాణానికి దాదాపుగా 400 నుండి 500కోట్ల డాలర్ల వరకు నేపాల్‌‌కు అవసరమని ఆర్థిక మంత్రి స్వర్ణిమ వాగ్లే తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జరిగిన నష్టం,విధ్వంసం ఇంకా అంచనా వేస్తున్నామని, ఇది కేవలం ఒక అంచనా మాత్రమేనని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్