సుప్రీంకోర్టులో పిటిషన్, 31న విచారణ
న్యూఢిల్లీ : పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా కేందాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈ నెల 31న సుప్రీం కోర్టు విచారించనుంది. పెట్రోల్ పంపుల వద్ద గల ప్రతి డిస్పెన్సింగ్ నాజిల్‌పై తప్పనిసరిగా, ఒకే రీతిన ఇథనాల్ శాతాన్ని ముద్రించేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ కోరుతోంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వర్లేలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించనుంది. నరేంద్ర కుమార్ గోస్వామి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి ఇంధన ఇన్‌వాయిస్‌పైనా విక్రయించిన పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత వుందో నిర్దిష్టంగా వెల్లడించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించాలని ఆ పిటిషన్ కోరింది. ‘‘ప్రతి వాహనానికి వివిధ ఇథనాల్ మిశ్రమాల అనుకూలతను లేదా అననుకూలతను సూచిస్తూ, వాహన తయారీ సంవత్సరం, మోడల్, ఇంజన్ నమూనాల వారీగా శోధించేలా వాహనాల వారీగా సమగ్ర రీతిలో డేటాబేస్‌ను నిర్దిష్ట కాలపరిమితిలో అధికారికంగా రూపొందించి, ప్రచురించాలని ప్రతివాదులను (కేంద్రం తదితరులు) ఆదేశించాలి.’’ అని ఆ పిటిషన్ పేర్కొంది. ప్రస్తుతం వాడుతున్న వాహనాల వారీగా వాస్తవిక వాహన అనుకూలతలను పరిశీలించి, ఒక నివేదికను సమర్పించడానికి స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆ పిటిషన్ కోరింది. ఆ కమిటీలో పెట్రోలియం, ఖనిజవాయువు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రతినిధులు, ఆటో మొబైల్ ఇంజనీర్లు వుండాలని పేర్కొంది.






కామెంట్‌లు (0)