సిఐటియు ఆధ్వర్యంలో వి.కోట పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్ల ధర్నా
రూ.25 లక్షల పరిహారం, భర్తకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
ప్రజాశక్తి-వి.కోట: అధికారుల వేధింపులు తాళలేక వి.కోట పీహెచ్‌సీలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న రాణి ఆత్మహత్యాయత్నం చేసి, వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు గురువారం వి.కోట ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, ఆశా వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు సుబ్బలక్ష్మి, గంగ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు మాట్లాడుతూ రాణి మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లను అధికారులు వేధిస్తున్నారని, ఈ విషయంపై పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటన జరిగిందని వారు ఆరోపించారు. గత నెలలో జిల్లా అధికారి సమక్షంలో జరిగిన జాయింట్ మీటింగ్‌లో కూడా ఆశా వర్కర్లపై జరుగుతున్న వేధింపులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజకీయ వేధింపులతో పాటు అధికారుల వేధింపులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాణి మృతికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు వచ్చిన పోలీసు అధికారులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం రాణి మృతదేహానికి ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.







కామెంట్‌లు (0)