అధికార బలంతో వైసిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు
జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన మాజీ సిఎం జగన్
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : టిడిపి కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైసిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని, ఇలాంటి అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బాధితులే నిందితులుగా మారుతున్నారని విమర్శించారు. దాడికి గురవుతున్న కార్యకర్తను కాపాడుకోవడానికి, రక్షణగా నిలవడానికి ఎమ్మెల్యే వెళ్లడమే నేరమా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని గురువారం వైఎస్ జగన్ పరామర్శించారు. తొలుత ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గాన జిల్లా జైలుకు చేరుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి విరూపాక్షిని పరామర్శించారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ... కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ విరూపాక్షిని అరెస్ట్ చేయించారని, ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఈ అరెస్టే ఉదాహరణ అని అన్నారు. వందల మంది పోలీసులు విరూపాక్షి ఇంటిలో చొరబడి, గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు కేసులు బనాయించి, ఆయనతో పాటు 38 మందిని జైలుకు తరలించారన్నారు. వైసిపి కార్యకర్త గిరిని తన కారులో తీసుకెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేశారని, ఈ దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేయి విరిగిందని, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక టిడిపి కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపి, ఎమ్మెల్యేపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను మీడియా ముఖంగా జగన్ ప్రదర్శించారు. కార్యకర్త గిరి, శ్రీరాములును తీసుకుని ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకోకపోగా, రివర్స్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపిలోని బిసి నాయకు లను లక్ష్యంగా చేసుకుని కుట్రలతో ఇరికిస్తు న్నారని, ఈ తప్పుడు సంప్రదాయం మున్ముందు ప్రభుత్వానికే చుట్టుకుంటుందని హెచ్చరించారు. తాను మాజీ ముఖ్యమంత్రిని అన్న గౌరవం కూడా ఇవ్వకుండా జైలు వద్ద కావాలనే నిలబెట్టి ఫొటోలు తీశారని విమర్శించారు.
మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ వాహనదారుల అవస్థలు
ఓర్వకల్లు నుంచి పంచలింగాలలోని జిల్లా జైలుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా రోడ్లపైకి రావడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.








కామెంట్‌లు (0)