శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సమగ్ర భూసర్వే క్రెడిట్‌ చోరీ

10 ఆగస్టు, 2026

mondi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 09:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైపిపి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌‌కుమార్‌

- జగన్‌ ప్రభుత్వం అనుసరించిన టెక్నాలజీ, పాస్‌‌బుక్‌‌లనే వాడుతున్నారు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జగన్‌ హయాంలో చేపట్టిన సమగ్ర భూసర్వేకు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌‌కుమార్‌ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 ఏళ్ల తర్వాత వైఎస్‌ జగన్ హయాంలోనే సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సమగ్ర భూసర్వే చేస్తే భూములు కొట్టేయడానికి చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే సమగ్ర భూసర్వేను తానే ప్రారంభించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు నాయుడిది ద్వంద్వ వైఖరని తెలిపారు. జగన్‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తే భూములు లాక్కుంటున్నారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే యాక్ట్‌ను యథాతథంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. బాబుకు టెక్నాలజీ కంటే ‘అబద్ధం అనే సాఫ్ట్‌వేర్‌’ బాగా తెలుసని, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్, సమగ్ర భూసర్వే అన్నీ తానే ప్రారంభించానని చంద్రబాబు చెప్పడం క్రెడిట్ చోరీనేనని అన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో భూసర్వే కోసం రెండు విమానాలు, రనాలుగు హెలికాప్టర్లు, 200కుపైగా హైఎండ్ డ్రోన్లు వినియోగించారని చెప్పారు. జీఎన్ఎస్ఎస్‌, జీఐఎస్‌, సీఓఆర్ఎస్‌, ఆర్టీకే, ఎన్ఆర్‌టీకే వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసర్వే నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్సీపీ హ‌యాంలో 6,800 గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపట్టామని, ఐదు సెంట్ల భూమిలో కూడా తేడా లేకుండా అత్యంత కచ్చితత్వంతో భూసర్వే చేశామని వివరించారు. టెర్రస్ట్రియల్ మ్యాపింగ్‌ను తొలిసారిగా చేపట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. గ్రామస్థాయికి రిజిస్ట్రేషన్ సేవలను తీసుకెళ్లింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. 15 వేల సచివాలయాల్లో ఈ-వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్లను నియమించామని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్‌బుక్స్‌నే రంగు మార్చి కొత్తవిగా చంద్రబాబు ప్రభుత్వం ఇస్తోందని, గత ప్రభుత్వం ఉపయోగించిన టెక్నాలజీనే చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. పాస్‌బుక్ ధరను రూ.55.79 నుంచి రూ.70కు పెంచి రైతులపై అదనపు భారం మోపారని పేర్కొన్నారు. 22-A భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్