సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు
ఫెడరేషన్ కన్వీనర్‌గా ఎం. సీతారాములు -14 మందితో కన్వీనింగ్ కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాష్ట్రవ్యాప్తంగా లోడింగ్, అన్ లోడింగ్ చేస్తున్న ముఠా కార్మికులకు పిఎఫ్, ఇఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని,అందుకోసం రాష్ర్ట వ్యాప్త ఉద్యమానికి ముఠా కార్మికులు సన్నద్ధం కావాలని సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో గురువారం ముఠా కార్మికుల రాష్ట్ర సదస్సు జరిగింది. దీనికి 300 మంది ముఠా కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు. ముఖ్య వక్తగా నర్సింగరావు హాజరై మాట్లాడుతూ...దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు పరిశ్రమలు, రైతుల నుండి మార్కెట్ కు చేరాలన్నా అక్కడ నుంచి గృహాలకు చేరాలన్నా ముఠా కార్మికుల పాత్ర కీలకమన్నారు. అటువంటి కార్మికులకు కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని, ప్రమాదాల జరిగితే ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుందే తప్ప, కనీస చట్టాలు కూడా అమలు చేయడం లేదన్నారు. సమాజంలో అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న ముఠా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ సమగ్ర చట్టం చేయాలని ఈ సదస్సులో తీర్మానించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సదస్సులు నిర్వహించాలని, అక్టోబర్ లో చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని సదస్సు తీర్మానించినట్లు తెలిపారు. ముఠా కార్మికులకు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్, ప్రమాదంలో మరణిస్తే బీమా, పిఎఫ్, ఇఎస్ఐతో కూడినటువంటి ఒక సమగ్రమైన చట్టం కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాలకు ముఠా కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
విజయవాడ నగర ముఠా యూనియన్ కార్యదర్శి ఎం.సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, విశాఖ జిల్లా ముఠావర్కర్స్ ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బారావు, యూనియన్ గౌరవాధ్యక్షులు వై.రాజు, నెల్లూరు జిల్లా నాయకులు నాగేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి చెన్నారావు, కర్నూలు నుండి ఓబులేసు, కృష్ణా జిల్లా నుండి సుబ్రహ్మణ్యం, పశ్చిమగోదావరి జిల్లా నుండి రంగారావు, విజయనగరం జిల్లా నుండి బి.రమణ, అనకాపల్లి నుండి రాము, అల్లూరి జిల్లా నుండి సుందర్, తిరుపతి నుండి సత్యనారాయణ, పార్వతీపురం నుండి సూరిబాబు, కడప నుండి మాధవయ్య, అన్నమయ్య జిల్లా నుండి ఎం.తిమ్మయ్యతోపాటు అనేకమంది నాయకులు ప్రసంగించారు. ప్రభుత్వ విధానాల వల్ల ముఠా కార్మికులు పనులు కోల్పోతున్నారని, ఆదాయాలు తగ్గిపోతున్నాయని, పని గంటలు పెరుగుతున్నాయని వారంతా వివరించారు. వివిధ నగరాలలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడం వల్ల తమ ఉపాధి తగ్గుతోందని తెలిపారు.
నో ఎంట్రీ టైముల వల్ల అత్యధిక సమయం పని చేయాల్సి ఉంటూందన్నారు. రాష్ట్రంలో ఉన్న ముఠా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం నూతన ఫెడరేషన్ కన్వీనర్‌గా ఎం.సీతారాములు ,14 మందితో కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు.








కామెంట్‌లు (0)