ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కెమెరాకు చిక్కిన పోలీసుల దాష్టీకం

1 గంట క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

దేశ రాజధానిలో విద్యార్థి నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు, గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా బలప్రయోగం చేయడం గుంపుల నియంత్రణకు సంబంధించిన ప్రామాణిక నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే. మొదట్లో కాస్త అనిశ్చితి చూపినప్పటికీ, జులై 27 సోమవారం నాడు పోలీసుల అతి వ్యవహారంపై దాఖలైన ఫిర్యాదులను విచారించడానికి భారత అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మరోవైపు సోషల్ మీడియాలో వెలుగు చూసిన అనేక వీడియో క్లిప్‌లలో యూనిఫాం ధరించిన వారితో పాటు సాధారణ దుస్తులలో ఉన్న వ్యక్తులు కూడా నిరసనకారులను చెదరగొట్టడానికి, భయపెట్టడానికి, గాయపరచాలనే ఉద్దేశ్యంతోనే హింసను ప్రయోగించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. కొంత మంది నిరసనకారులకు పెల్లెట్ గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు, అధికారులు ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఒక వీడియోలో, ఢిల్లీ పోలీసులకు చెందిన ఓ సీనియర్ అధికారి దగ్గరలో నిలబడి ఉన్న అమ్మాయిని చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. మరొక వీడియోలో, యూనిఫాంలో ఉన్న మూడు నక్షత్రాల అధికారి ఒక అమ్మాయి వెళ్తుండగా వెనుక నుండి ఆమెను గుచ్చడం కనిపిస్తుంది. మూడవ వీడియోలో, సిబ్బంది ఓ అమ్మాయిని చుట్టుముట్టి...ఒకరు ఆమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తుంటే, మరికొందరు నవ్వుతూ వేధించడం కనిపిస్తుంది. హెల్మెట్లు ధరించిన కొందరు సాధారణ వ్యక్తులు నిరసనకారులను కొడుతున్న దృశ్యాలు కూడా కెమెరాకు చిక్కాయి. కొంతమంది తుప్పు పట్టిన పొడవైన మేకులు పొదిగిన కర్రలను పట్టుకుని కనిపించగా, మరికొందరు వాహనాలను ధ్వంసం చేయడం కనిపిస్తుంది. ఒకటి రెండు చిన్న సంఘటనలు మినహా, నిరసనకారులు శాంతియుతంగా ఉన్న సమయంలోనే ఇదంతా జరిగింది.అధికారిక పోలీసు సిబ్బందైనా, విద్యార్థుల నిరసనల్లోకి ప్రవేశించిన అల్లరి మూకలైనా... ఈ హింసకు పాల్పడిన వారిని గుర్తించి, విచారించి చట్టపరంగా బాధ్యులను చేయాలి.

ఢిల్లీలో విద్యార్థి నిరసనకారులపై జరిగిన పోలీసు హింస వారికి అలవాటైన పాత పద్ధతినే తలపిస్తోంది. 2020లో ఒక మూక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఆ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు కానీ, అరెస్టులు కానీ జరగలేదు. 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఢిల్లీ పోలీసులు జామియా మిల్లియా ఇస్లామియా లైబ్రరీలోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేశారు. వివిధ పరీక్షల్లో పదేపదే జరుగుతున్న పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు సాగించిన దౌర్జన్యకర చర్యలు ఈసారి పరాకాష్టకు చేరాయి. కౌమార దశలో ఉన్న పిల్లలు, పసిపిల్లలతో వచ్చిన కుటుంబాలు, మహిళలతో కూడిన ఈ నిరసనకారులు, పోలీసులు ఈ స్థాయిలో బలప్రయోగానికి దిగేంతటి పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇంతకు ముందు ఫిర్యాదులను విచారించడానికి సాంకేతిక కారణాల వల్ల మాత్రమే నిరాకరించాననీ, న్యాయం కోసం వచ్చేవారికి కోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భారత ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేయడం ఊరటనిచ్చే అంశం. పోలీసులు ఉపయోగించిన బలప్రయోగ స్వభావాన్ని, తీవ్రతను సమగ్రంగా వివరించే రెండు పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. అసలు ఈ బలప్రయోగానికి పాల్పడినవారు ఎవరు? ఇందుకు అధికారికంగా ఆమోదం ఉన్నదా? పోలీసులు చేసిన బలప్రయోగం పరిమితులకు లోబడి ఉన్నదా లేదా అనే అంశాలను నిర్ధారించడానికి సమగ్ర విచారణ జరగాలి. లైంగిక వేధింపులు, మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి. తప్పు చేసినట్లు రుజువైన వారు చట్టం ప్రకారం శిక్షించబడాలి.


/‘హిందూ’ దినపత్రిక సంపాదకీయం/

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్