పన్నెండు సంవత్సరాల ఒక్క నెల ఒక్కరోజు తర్వాత భారత దేశంలో భయం అటు నుంచి ఇటు మారిందని జంతర్ మంతర్ లో బొద్దింకల నిరసనలపై ‘అల్‌జజీరా’ వ్యాసకర్త ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మాటలు నూటికి నూరు శాతం నిజం కాకపోవచ్చుగాని ప్రపంచంపై ప్రసరించిన ప్రభావం తీవ్రత, ప్రచార దాడులను, నిర్బంధాన్ని తట్టుకుని నిలబడిన తీరు, మెట్టు దిగిరావలసిన పరిస్థితి కల్పించడం మాత్రం నిజం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బొద్దింకల ఉద్యమ ఉత్తేజం తారా స్థాయికి చేరింది. ఉద్యమాలు, నిరసనలు ఇంకా ఎక్కడున్నాయని చప్పరించిన వారు, మోడీకి తిరుగు లేదని సాగిలబడదామన్నవారు కూడా కళ్లు తెరవాల్సిన సందర్భం. ఇప్పటికీ విద్యార్థుల ఆందోళనలపై విష ప్రచారాలకు లోటు లేదనడానికి తెలుగు రాష్ట్రాల నేతల వరుస ప్రకటనలే సాక్ష్యం. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోవచ్చుగానీ అది విచ్ఛిన్న శక్తుల చేతుల్లోకి పోవడం సమర్థనీయం కాదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉవాచ. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి తదితరులందరూ ఇదే వరుస. మీడియాపై దాడులూ, హిందూత్వ సనాతన పేరిట ప్రచారాలు శృతి మించిన వేళలో బొద్దింకల దండయాత్ర వారికి ఒక కుదుపులా సోకిందనడంలో సందేహం లేదు. ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైసిపి, బిఆర్‌ఎస్ లు కూడా తమ తమ రాజకీయ కోణాలను బట్టి మాత్రమే ప్రతిస్పందిస్తూ స్థానిక ప్రత్యర్థులపై లెక్కలు వేసుకుంటున్నా వచ్చిన అలజడిని మాత్రం విస్మరించలేని విచిత్ర సన్నివేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కూడా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న సమయం. నిజమైన ప్రజాస్వామిక, లౌకిక విలువలు, ప్రజా ప్రతిఘటనలను ఆహ్వానించే వారంతా హర్షించే ఈ మహా నిరసన పాలక వర్గాలలో మాత్రం పరిపరి విధాల ప్రతిస్పందనలు తీసుకురావడం ఆశ్చర్యమే కానీ ఇటీవలి పరిణామాలు గమనిస్తున్న వారికి మాత్రం ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే బొద్దింకల యుద్ధానికి ముందు నుంచీ అన్ని వ్యవస్థలలో వచ్చిన ఆందోళనకర లక్షణాలే ఈ సమయంలోనూ గోచరించాయని చెప్పాలి.
మహనీయుల ముద్రలు
నిజానికి ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ వారం చాలా కీలకమైన సందర్భం అవుతుంది. దేశంలో సంఘ సంస్కరణలతో సనాతన ఛాందసాలను ప్రశ్నించిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వర్ధంతి జులై 29. సనాతనం ఎప్పటి నుంచో నిషేధించి అనేక విధాల అవమానాలకు గురి చేసిన వితంతువుల హక్కుల కోసం పోరాడిన విద్యాసాగర్ ప్రేరణతో నాటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ కానింగ్ పునర్వివాహ చట్టాన్ని ఆమోదించిన రోజు 1856 జులై 26. కందుకూరి వీరేశలింగం గారిని ఆంధ్ర విద్యాసాగర్ అని పిలిచింది అందుకే. వ్యవస్థలను ప్రశ్నించి వ్యంగ్య వైభవాన్ని, సామాజిక చైతన్యాన్ని చాటిన నోబెల్ గ్రహీత జార్జి బెర్నార్డ్ షా పుట్టిన రోజు కూడా 1856 జులై 26 కావడం ఆసక్తికరం. మూఢన్మకాలపై పోరాడిన నాస్తికోద్యమ నాయకుడు గోరా పుట్టింది కూడా 1915 జులై 26నే కావడం ఆసక్తికరం. నూట యాభై ఏళ్ల తర్వాత కూడా సనాతన జపం చేసేవాళ్లకు తప్పక గుర్తు చేయవలసిన రోజు ఇది. సోషలిజం కూలిపోయిందని చంకలు గుద్దుకున్నవారికి సమాధానంగా మంచు కరిగినా పర్వతం నిలిచే వుంటుందని చాటిన సి.నారాయణరెడ్డి పుట్టిన రోజు కూడా ఈ నెల 29 (1931)నే వస్తుంది. అందరినీ మించి స్వాతంత్ర్య పోరాటంలోనూ ప్రజా సాహిత్య సృష్టి లోనూ తనదైన ముద్ర వేసిన మహా రచయిత, స్వాతంత్ర్య సమర యోధుడు ప్రేమ్ చంద్ జయంతి కూడా జులై 31(1880). ఆయన అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి మహాసభ లక్నోలో జరిగింది కూడా సరిగ్గా తొంభై సంవత్సరాల కిందట1936 లోనే కావడం గమనించదగింది. తారీఖులూ దస్తావేజులు అని శ్రీశ్రీ అన్నట్టు ఈ తేదీలన్నీ కూడా భారత ప్రజల సమరశీలతనూ ప్రగతిశీల సాంస్కృతిక ప్రస్థానాన్ని చెబుతాయి. సామాజిక పునర్వికాసం సాంస్కృతిక పునరుజ్జీవం కోసం జరగాల్సిన కృషిని గుర్తు చేస్తాయి.
ఎర్రకోట నుంచే మొదలు
దక్షిణాసియాలో చాలా దేశాలలో ప్రజాస్వామ్యం కల్లోలాలు, కుట్రలు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం స్థిరంగా నిలబడగలిగిందంటే ఇక్కడ బలీయమైన రాజ్యాంగ పునాదులు, ప్రజా చైతన్యం, లౌకిక సంస్కృతి కారణం. కచ్చితంగా ఆ పునాదులకే ఇప్పుడు సవాలు ఎదురవుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం మొత్తం మీద పదిలంగా కొనసాగడానికి కీలకమైన ఒక కారణం సార్వజనిక లేదా సార్వత్రిక ఓటింగ్ హక్కు. కుల, మత జాతి, భాష, లింగ వివక్ష లేని ఓటింగ్ హక్కు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ వంగ అనే రవీంద్రుడు రచించిన జాతీయ గీతాన్ని మనం పాడుకుంటున్నప్పుడు భారత భాగ్య విధాతను వీటన్నిటి ప్రతిరూపంగానే చూస్తాం తప్ప విభజనలు ఆలోచించం. గత ఏడాది ఎర్రకోట నుంచి చేసిన తాజా ప్రసంగంలో ప్రధాని మోడీ దేశ జనాభా పొందికను మార్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని చేసిన ఆరోపణల్లో అతి పెద్ద అదృశ్య కుట్ర కనిపిస్తుంది. 140 కోట్ల జనాభా కలిగిన ఒక చారిత్రిక వైవిధ్య భరిత దేశ జనాభా పొందిక ఎవరైనా ఎలా మార్చగలరనేది పెద్ద ప్రశ్న. అయితే అలా మారిపోతుందన్న భయాందోళనలు జనంలో సృష్టించితే మిగిలిన పని దానికదే జరిగిపోతుందన్నది మోడీ, ఆయనను నడిపించే ఆర్‌ఎస్‌ఎస్-సంఘ పరివార్ వ్యూహం. అందుకనే ఈ వ్యాఖ్యలతో పాటే ప్రధానమంత్రి వందేళ్ళ ఆర్‌ఎస్‌ఎస్ ఘనతను కూడా కీర్తించి తరించారు. దేశంలోనే అతి పెద్ద ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ)గా ఆయనే అభివర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి మార్గదర్శి కావటం కన్నా అభ్యంతరకరమైన విషయం ఇంకొకటి ఉండదు. తర్వాతి కాలంలో చూసిన పరిణామాలన్నీ అందుకు తగినట్టే వుండటం యాదృచ్ఛికం కాదు. గతంలో వాజ్‌పేయి వంటి వారి హయాంలో రహస్య ఎజెండాగా ఉన్నది కాస్త ఇప్పుడు ఏకంగా ఎర్రకోటపై జాతీయ జెండాతో పాటు ఎగురవేయబడటమే దిగ్భ్రాంతికరమైన విషయం. ఇరుగు పొరుగు దేశాల్లోంచి, ఇతర మతాల నుంచి ఈ ముప్పు పొంచి ఉందని మోడీ మాటల సారాంశం విడమర్చి చెప్పనక్కర్లేదు. కచ్చితంగా ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి ని మించిన సనాతన సంఘీయుడు పవన్ కల్యాణ్ కూడా దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని ప్రతిపక్షాలపై నిందలు వేయడం యాదృచ్ఛికం కాదు. ఇంచుమించు ఇదే రీతిలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ''మార్వాడీలకు, గుజరాతీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు ముసుగులో కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని'' అర్థరహితమైన అభాండం వేశారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి పాత్రికేయుడు దేశంలో ముస్లింలకే కాక క్రైస్తవులకు కూడా వేధింపులు పెరిగిపోతున్నాయని సూటిగానే వ్యాసం రాశారు. నిజానికి హిందువులు కూడా తమను తాము ఎవరి ముందో నిరూపించుకోవాలన్న స్థాయికి చేరింది ఈ కుహనా దేశభక్తి. ఇది కేవలం బిజెపి కి మాత్రమే పరిమితం కాదని పవన్ కల్యాణ్ వంటి వారి మాటలు హెచ్చరిస్తున్నాయి.
అమరావతిపై హిందూ ముద్ర?
అక్రమ వలసలను అడ్డుకునే పేరిట బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు అనేకం గీత దాటి వ్యవహరిస్తున్నాయని ''హిందూ'' పత్రిక గత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే సంపాదకీయం రాసింది. అధికార పత్రాలు లేని బంగ్లాదేశీయులుగా ముద్ర వేసి ఆ పేరుతో బెంగాలీల ఓటు హక్కు హరించే ఒక పెద్ద కార్యక్రమం సాగుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ ప్రభావం తర్వాత ఎన్నికల ఫలితాలలోనూ చూశాం. రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని కూలదోసిన విధ్వంసకాండ నిజానికి ఆయన చాటిన విలువలపై దాడి. బౌద్ధంపై అపారమైన పరిశోధనలు చేసిన రాహుల్ వంటి వారు సనాతనానికి ఎలా వ్యతిరేకులు? ఆ బౌద్ధం పరిఢవిల్లి అమరావతి పేరుతో రాజధాని కడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది హిందూ ముద్రతో కడుతున్నామని చెప్పడంలో అర్థం ఏమిటి? లోక్ అదాలత్‌లు మధ్యవర్తిత్వాలతో సత్వర న్యాయం అందాలని చెప్పే అత్యున్నత న్యాయస్థానం బొద్దింకల వీడియో సాక్ష్యాలను కూడా చూడటానికి సమయం లేదని తిరస్కరించడం దేనికి నిదర్శనం? విద్యాసాగర్ నుంచి రాహుల్జీ వరకూ ప్రజా సంస్కృతితో ప్రజాస్వామిక లౌకిక విలువలతో సంబంధం లేని వారు ఇతరులపై జాతి వ్యతిరేక ముద్రలేసి వేధించడం ఏమిటి? భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చైనాతో సంబంధాల పెంపు గురించి శిఖరాగ్రసభల్లో మాట్లాడుతుంటే బొద్దింకలు చైనా ఏజంట్లని నిందారోపణలు చేయడమేమిటి? కులం, మతం, ప్రాంతం మాత్రమే గాక దేశాంతర ముద్రలతో నిరసనల గొంతు నులిమే ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి విఫలమయ్యేది మనకు ఇప్పుడు జంతర్ మంతర్ చెబుతుంది. అయినా పాలకుల పాచికలు మాత్రం మారవు. అదే విధంగా ప్రజల నిరసనలూ ఆగవు. ఈ క్రమంలో యువత అన్ని గీతలూ అణచివేతలూ అధిగమించి ముందుకు రావడమే ఇప్పుడు ఆహ్వానించదగిన ఘట్టం. ఈ సమరశీలతకు తోడు సమ ధర్మం, సామాజిక న్యాయం కోసం కూడా గొంతు విప్పవలసిన అవసరాన్ని వారు గుర్తించడం తథ్యం. ఇరాన్‌ను నలిపేస్తానని బయిలుదేరిన ట్రంప్ పల్టీలు గనక గమనిస్తే భారత దేశంలో ఆయన హౌడీ మోడీ అంటూ హత్తుకున్న విశ్వగురువు విధానాలకూ అదే గుణపాఠం తప్పదని తేలిపోతుంది.
రేవంత్ ఎత్తుగడలేంటి?
బాధాకరమైన విషయం ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బిజెపి మత రాజకీయాలను, ఏకపక్ష పొగడ్తలను ప్రశ్నించకపోవడమే కాదు. టిడిపి, జనసేన ల వలె కేంద్రాన్ని పొగడ్డమే కాదు. పక్కదోవ పట్టించడం కూడా జరుగుతున్నది. ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగు నాట విశాల జాతీయ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోణాన్ని పూర్తిగా విస్మరించి పరస్పర తగాదాలకు స్వల్పకాలిక అంశాలకు పరిమితం కావటం మరింత విచారం కలిగిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నా బిఆర్‌ఎస్‌కూ వారికీ మధ్యన యుద్ధమే ప్రధానమని అనేక సార్లు వెల్లడైంది. దీన్ని అవకాశంగా తీసుకుని తను బలపడటానికి బిజెపి వ్యూహాలు రచిస్తున్నది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఒకసారి పర్యటించి అంతర్గత ఐక్యత కోసం బోధలు తీసుకుని వెళ్లగా ఇప్పుడు ఏకంగా అమిత్ షా రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నిరసనను పట్టించుకోకుండా భోగాపురం విమానాశ్రయానికి మోడీని ఆహ్వానించేందుకు హడావుడి పడుతుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా ప్రధానిని కలవబోతున్నారని ఆ పార్టీ నాయకులు మురిసిపోతున్నారు. ఈ విధంగా దేశంలో చూస్తున్న దానికిది యాంటీ క్లైమాక్స్ అనాలేమో?

- తెలకపల్లి రవి







కామెంట్‌లు (0)