"మాతా పితృ సహస్రాణి పుత్ర దార శతాని చ | అభ్యతీతాని భావస్య ప్రయాస్యంతి తథా పరే" అనే శ్లోకానికి ‘అనేక తరాల తల్లిదండ్రులు, కుటుంబాలు కాల ప్రవాహంలో గడిచిపోయాయి. సమాజానికి వేరుజాతిన పెద్దలను గౌరవించి, కాపాడుకోవడం ధర్మం’ అని అర్థం. మన సమాజంలో పెద్దలు కేవలం అనుభవజ్ఞులే కాదు, సంస్కృతికీ అనుబంధాలకూ మూలస్తంభాలు. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు నేడు వారి ఉనికికే సవాలుగా మారాయి. ఒక దేశం నాగరికతను కొలవాలంటే అది తన పిల్లలను ఎలా చూస్తుందో మాత్రమే కాదు... తన వృద్ధులను ఎంత గౌరవంగా, ఎంత భద్రంగా జీవించేలా చేస్తుందో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రోజు వాతావరణ మార్పులు ప్రపంచాన్ని సవాలు చేస్తున్న వేళ, అత్యంత నిశ్శబ్దంగా ఆ ముప్పును మోస్తున్నవారు వృద్ధులు. వేడి తరంగాలు, తుఫానులు, వరదలు, కరువులు—ఇవి ప్రకృతిని మాత్రమే కాదు, జీవిత చరమాంకంలో ఉన్న లక్షలాది మంది మనుషుల ఆశలను, ఆరోగ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. వృద్ధాప్యం ఒక మనిషి జీవన దశ మాత్రమే కాదు; అది అనుభవాల సంపద. ఆ సంపదను కాపాడుకోవడం సమాజ బాధ్యత.
వాతావరణ మార్పుల ప్రభావం అందరిపై ఉన్నప్పటికీ, సమాజంలో అత్యంత వేగంగా దెబ్బతినే తరగతి మన వృద్ధులేనని "హెల్ప్ ఏజ్ ఇండియా" నివేదికలు, ఇటీవలి అధ్యయనాలు ఈ చేదు నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం వృద్ధుల వయస్సుకు సంబంధించినదే కాదు; పేదరికం, ఒంటరితనం, అనారోగ్యం, అంగవైకల్యం, అసురక్షిత గృహాలు, బలహీనమైన సామాజిక భద్రత... ఇవన్నీ కలిసిన వాతావరణ మార్పు వారికి ప్రాణాంతకంగా మారుతోంది. 2022లో దేశంలో 14.9 కోట్లుగా ఉన్న వృద్ధుల జనాభా, 2050 నాటికి 34.7 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే రేపటి భారతదేశం మరింత "వృద్ధ భారతం"గా మారబోతోంది. ముఖ్యంగా వాతావరణ మార్పు అందరినీ ఒకేలా తాకదు. కుటుంబంతో ఉన్న ఆరోగ్యవంతుడైన వృద్ధునికీ, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళకీ ప్రమాదం ఒకేవిధంగా ఉండదు. వృద్ధుల్లో వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి తగ్గిపోవడానికి అనేక సామాజిక, శారీరక అంశాలు కారణమౌతున్నాయి. అందుకే వాతావరణ న్యాయం అంటే పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు; సామాజిక న్యాయం కూడా అనేది గుర్తించాల్సిన అవసరాన్ని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘తల్లిదండ్రుల వాత్సల్యం తెలియదు, వారు తల్లిదండ్రులయ్యేంత వరకు’ అంటారు ఎమర్సన్. వృదులైన తర్వాతే జ్ఞానం పెరుగుతుంది అనుకుంటే, అప్పటికి సమయం మించిపోతుంది. భూమి మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వం కాదు; మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు. నేటి వృద్ధులే నిన్నటి సమాజ నిర్మాణ శిల్పులు. వారి అప్పు తీర్చాలంటే, మనం వృద్ధులను కూడా కాపాడాలి.
ప్రస్తుతం వృద్ధులను ప్రభావితం చేస్తున్నది ఒక్క ఉష్ణోగ్రత కాదు... ఒంటరితనం కూడా. ఒంటరితనం కూడా ఒక విపత్తే. ‘సంతోషంగా వుండే కుటుంబాలన్నీ ఒక్కలాగే వుంటాయి. కానీ, కష్టాల్లో వుండే కుటుంబాలే ఒక్కొక్కటీ ఒక్కొక్కరకంగా వుంటాయి’ అంటారు టాల్‌స్టాయ్. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఊళ్లూ, దేశాలు పట్టుకొని పిల్లలు వలసలు పోతున్నారు. గ్రామాల్లోనూ నగరాల్లోనూ వేలాది మంది వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. వాతావరణం వల్ల వచ్చే వేడికంటే ఒంటరితనం వల్ల కలిగే నిస్పృహే వారిని మానసికంగా కాల్చేస్తుంటుంది. ఇప్పుడు వాతావరణ విధానాల్లో కూడా "వృద్ధుల దృష్టికోణం" అవసరం. వృద్ధులకు అనుకూల ఆరోగ్య వ్యవస్థలు, వాతావరణాన్ని తట్టుకునే గృహాలు, స్థానిక స్వచ్ఛంద బృందాలు, ప్రతి గ్రామంలో అత్యవసర సహాయక నెట్‌వర్క్‌లు ఏర్పడాలి. కుటుంబాలు కూడా తమ వృద్ధులను ఒంటరిగా వదిలేయకుండా బాధ్యత వహించాలి. ఒక చెట్టును కాపాడితే పర్యావరణం పరిఢవిల్లుతుంది. ఒక వృద్ధుడిని కాపాడితే ఒక కుటుంబ చరిత్ర మిగతావారికి ఆదర్శమౌతుంది. వాతావరణ మార్పులపై పోరాటం అంటే, కేవలం ప్రకృతిని రక్షించే ఉద్యమం మాత్రమే కాదు. వృద్ధుల గౌరవాన్ని, జీవితాన్ని, మనిషితనాన్ని కాపాడే మానవీయత కూడా. ‘ప్రతి ఒక్కరూ తన ఇల్లు బాగుచేసుకుంటే ప్రపంచమంతా బాగుపడుతుంది’ అంటారు జర్మన్ సాహితీవేత్త గాథే. భారతదేశం నిజంగా "వికసిత భారత్" కావాలంటే, ఈ దేశంలోని వృద్ధులు భయపడకుండా జీవించగలిగే "స్థితిస్థాపక భారత్"గా మారాలి.







కామెంట్‌లు (0)