- పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరులో ప్రారంభం
- పలు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పించిన అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు : పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర ప్రగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకునే విధంగా పాఠశాల విద్యాశాఖ ఎల్‌ఇఎపి (లీప్) యాప్‌ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ఒకటి నుండి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలలో సౌకర్యాలు, ఉపాధ్యాయుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో విద్యార్థుల హాజరుకే పరిమితం అయిన ఈ యాప్‌లో ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసే విధంగా అభివృద్ధి చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లాను ఎంపిక చేసి శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ఐటి విభాగం ఇన్‌ఛార్జి సిహెచ్.వి.రమేష్, సిబ్బంది కలిసి నగరంలోని పలు పాఠశాలలను సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో దీనిని అమలు చేయనున్నట్లు గుంటూరు జోన్ ఆర్‌జెడి బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, ఎంపెన్ ఐడి లేదా పుట్టిన తేదీ, ఓటిపి ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందని వివరించారు. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లవాడు ఎలా చదువుతున్నారు? ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారు? ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారు? పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? వంటి సందేహాలకు సమాధానంగా ఈ యాప్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు? వారి పూర్వ, ప్రస్తుత సర్వీసు వివరాలు? వారు ఏయే సబ్జెక్టులు బోధిస్తారు? పాఠశాలలో ఇస్తున్న పుస్తకాలు, విద్యాపరికరాలు, విద్యార్థి ఆరోగ్య వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. విద్యార్థులు రాసే ఎఫ్‌ఎ, ఎస్‌ఎ పరీక్షలు, వాటిలో విద్యార్థులు సాధించిన ప్రగతి, సర్టిఫికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలు పిడిఎఫ్, ఛాప్టర్ల వారీగా వీడియోలు ఉంటాయి. పాఠశాలలో బోధించిన అంశాలను మరోసారి నెమరు వేసుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. పరీక్షల మోడల్ పేపర్లు, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా తల్లిదండ్రులు వారి సూచనలు, సలహాలు కూడా విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు ఇవ్వవచ్చు.








కామెంట్‌లు (0)