శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉక్కు రాష్ట్రంగా ఎపి

1 గంట క్రితం

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాయలసీమకు నవశకం

- స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు

​ప్రజాశక్తి- కడప ప్రతినిధి : ‌ ఇప్పటికే ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ, ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్, త్వరలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రానున్న స్టీల్ ప్లాంట్లతో ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జెఎస్ డబ్ల్యు ఆధ్వర్యంలో రూ.36,700 కోట్లతో నిర్మించనున్న పలు పరిశ్రమలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్ద దండ్లూరు గ్రామాల పరిధిలో రూ.16,500 కోట్లతో ఏర్పాటు కానున్న రాయలసీమ ఉక్కు పరిశ్రమ, రూ.20,350 కోట్లతో ఏర్పాటు కానున్న సోలార్ క్యాప్టివ్ పరిశ్రమ, విజయనగరం జిల్లా శృంగవరపుకోట పరిధిలో ఇండస్ట్రీయల్ పార్క్ వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా సున్నపురాళ్లపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, అనంతపురంలో కియా పరిశ్రమ, పుట్టపర్తిలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, కర్నూలు జిల్లా స్వర్ణగిరిలో బంగారం గనులు, తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ హీరో మోటార్ల రాకతో రాయలసీమలో నవశకం ప్రారంభమైందని పేర్కొన్నారు. సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో జెఎస్ డబ్ల్యు ఆధ్వర్యంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఫేస్-1 కింద రూ.4,500 కోట్లు, ఫేస్-2 కింద రూ.11,550 కోట్లతో నిర్మాణం జరగనుందని వెల్లడించారు. అనుబంధ పరిశ్రమల కోసం 1,400 ఎకరాలు కేటాయించామని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమలో దేశంలోనే మొదటిసారి గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు.

ఆగస్టు 15లోపు రూ.లక్ష కోట్లతో మదనపల్లిలో గ్లోబల్ హార్టీకల్చరల్ హబ్

ఆగస్టు 15లోపు రూ.లక్ష కోట్లతో మదనపల్లిలో గ్లోబల్ హార్టీకల్చరల్ హబ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనుందని, ప్రయివేటు కంపెనీలు రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. విజయనగరం ఇండస్ట్రీయల్ పార్క్ తోపాటు అరకులోయలోని 300 ఎకరాల్లో టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర ఆత్మాభిమానంతో ఆడుకోవడం తగదు

‘రాష్ట్ర రాజధాని అమరావతి’ అంటూ కేంద్రం చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ పేరిట రాజకీయం చేయడం దారుణమని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ఆత్మాభిమానంతో ఆడుకోవడం తగదన్నారు. గత ప్రభుత్వ పెద్దలు బ్రహ్మణి పేరుతో రాయలసీమ ఐరన్ ఓర్, ఇతర ఖనిజాలను దోచుకున్నారని విమర్శించారు. తాము రాయలసీమ సంపదను రాయలసీమ అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు, కనీసం పులివెందుల నియోజకవర్గానికీ నీళ్లవ్వలేదని విమర్శించారు. గండికోట, రాజోలి, ఎస్ ఆర్ బిసి, ఆర్ టిపిపి పెండింగ్ పరిహారం, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలగనూరు రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

ఉక్కు ఉత్పాదనపై దేశాభివృద్ధి : కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

అనంతరం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఉక్కు ఉత్పాదనపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 170 మిలియన్‌ ‌టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోందని, ఇందులో 20 శాతం జెఎస్ డబ్ల్యు చేస్తోందని తెలిపారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి సవితమ్మ, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, వరదరాజులరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విపిఎన్‌ ‌మాధవ్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్