- విశాఖలో సత్యాగ్రహ దీక్ష
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం)
రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం వందలాది మందితో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎపి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్, వర్కర్స్ జెఎసి రాష్ట్ర గౌరవ చైర్మన్ ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుతం ఆ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలోని మూడు లక్షల మంది ఉద్యోగులు అసెంబ్లీకి కదిలి వస్తారని హెచ్చరించారు. వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులను వివిధ శాఖలు, వివిధ పేర్లతో అనేక కేడర్లుగా విభజించి పలు రకాలుగా వేతనాలు ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. జెఎసి రాష్ట్ర చైర్మన్ కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగులతో సదస్సులు జరుగుతున్నాయన్నారు. విశాఖలో దీక్ష చేపట్టామని, శనివారం రాజమండ్రిలో గోదావరి జిల్లాల గర్జన జరుగుతుందని, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ పోరాటానికి రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో అప్కాస్ ఉద్యోగుల జెఎసి ప్రధాన కార్యదర్శి పి.వెంకట సుబ్బయ్య, సమగ్ర శిక్ష కెజిబివి రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, ఎన్హెచ్ఎం రాష్ట్ర జెఎసి చైర్మన్ డి.దయామణి, మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ నాయకులు యు.రాజు, అనకాపల్లి జిల్లా జెఎసి నాయకులు వివి.శ్రీనివాసరావు, విశాఖ జిల్లా జెఎసి నాయకులు పి.మణి, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, విమ్స్, కెజిహెచ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్, 2వ ఎఎన్ఎం, అర్బన్ యుపిహెచ్సి, ఆర్టిసి, విద్యుత్ తదితర రంగాల ఉద్యోగులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)