ప్రజాశక్తి అమరావతి : కోర్టు హాలులో జరిగిన విచారణలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకునేలా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. న్యాయవాదుల ప్రొఫెషనల్ ఫీజులకు సంబంధించి ఇప్పటికే కోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయని, వాటిని అధ్యయనం చేసి తమ ముందుంచాలని ఆదేశిస్తే.. అందులో తమకు అన్య ఉద్దేశాలు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. కోర్టు అధికారులైన న్యాయవాదులు ఈ విధంగా మాట్లాడటం తగదని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపైనా ఉందని స్పష్టం చేసింది. కోర్టు హాలులో తగిన మర్యాద పాటించాలని శ్రవణ్‌కుమార్‌కు సూచించింది. ఏ న్యాయవాదినీ వాదనలు వినిపించకుండా తాము అడ్డుకోబోమని, అనవసరమైన వాదనలు చేసినప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటామని తెలిపింది. రహదారిపై విగ్రహాల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు ఆ రోజు తగినంత సమయం లభించలేదని చెప్పడమే ఉద్దేశమని, తీర్పుల ప్రతుల కోసం సుదీర్ఘకాలం వేచి ఉండటం వల్ల ప్రయోజనం లేదన్నానని శ్రవణ్‌కుమార్ తెలిపారు. కోర్టుకు క్షమాపణలు చెబుతున్నానని, న్యాయవాదిగా వాస్తవాలను కోర్టు ముందుంచే హక్కు తనకు ఉందన్నారు. బెంచ్ తన వాదనలు వినకుండా అడ్డుకుందని మాత్రమే చెప్పానని, ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆయన వాదనను అంగీకరించలేమని పేర్కొంది. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని, తాము తమ ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశామని పేర్కొంది. పిల్‌పై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగిందంటే..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ప్రొఫెషనల్ ఫీజు చెల్లించారంటూ మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు దాఖలు చేసిన పిల్ విచారణలో భాగంగా న్యాయవాదుల ఫీజుల చెల్లింపుపై హైకోర్టుతో పాటు ఇతర కోర్టులిచ్చిన తీర్పులను అధ్యయనం చేసి తమ ముందుంచాలని ధర్మాసనం ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. పిటిషనర్‌కు కేవలం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రానే ఎందుకు కనిపించారని, ఏళ్లుగా పలువురు న్యాయవాదులకు ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ ఇతర చెల్లింపులను ఎందుకు ప్రస్తావించలేదని శ్రవణ్‌కుమార్‌ను ప్రశ్నించింది. అనంతరం ఆయన ఈ వ్యవహారంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.







కామెంట్‌లు (0)