పేపర్ లీక్‌లు, నిలిచిపోయిన నియామకాలు, పెరిగిన విద్యా ఖర్చులు
ముంబయి : పేపర్ లీక్‌లు, నిలిచిపోయిన నియామకాలు, పెరుగుతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలో వివిధ సమస్యలపై నిరసనకు దిగిన విద్యార్థులకు ఆదివారం ఆయన మద్దతు తెలిపారు. మహారాష్ట్రలో వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా రోడ్లపైకి వచ్చారని, వారి ఆందోళన కేవలం ఒక పరీక్ష లేదా నియామకానికి సంబంధించినది కాదని రాహుల్‌గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లడమే వారి ఆందోళనకు కారణమని అన్నారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా బిజెపి పాలనలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పేపర్ లీక్‌లు, నిలిచిపోయిన నియామకాలు, భరించలేని విద్యా ఖర్చులు, హాస్టళ్లలో అమానవీయ పరిస్థితులు, నాణ్యత లేని ఆహారం, డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్)లో అక్రమాలు వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంఫీఎస్‌సీ) వంటి రాజ్యాంగబద్ధ సంస్థను కూడా తమ ఆధీనంలోకి తీసుకుని, దాని విశ్వసనీయతను దెబ్బతీశారని మండిపడ్డారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రతి డిమాండ్ న్యాయమైనదేనని రాహుల్‌గాంధీ అన్నారు. ప్రభుత్వం వారి గొంతును విని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయం జరిగే వరకు విద్యార్థుల నిరసన మరింత తీవ్రంగా మారుతుందని హెచ్చరించారు.
ఎంఫీఎస్‌సీ పరీక్షపై ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇన్‌స్పెక్టర్ స్క్రీనింగ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం స్క్రీనింగ్ పరీక్షను మార్చి 22న మహారాష్ట్రలోని ఆరు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో నిర్వహించారు. జూన్ 12న ఫలితాలు ప్రకటించారు. ఇంటర్వ్యూలు పూర్తయిన అనంతరం 485 మంది అర్హులు, ముగ్గురు అనర్హులతో కలిపి మొత్తం 488 మంది అభ్యర్థులతో తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితాను కమిషన్ ప్రకటించింది. అయితే జూలై 22 నుంచి 26 మధ్య పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. పరీక్షకు ముందే, మార్చి 20న కొంతమంది అభ్యర్థులకు ప్రశ్నపత్రం లేదా ప్రశ్నలు అందాయని, అనంతరం వాటిని సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేశారని ఫిర్యాదుల్లో ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది.
ఆరుగురు అరెస్టు
ఈ కేసులో నిందితురాలు రుతుజా పాటిల్‌ను నందుర్బార్‌లో క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 26న ఎంఫీఎస్‌సీ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్షకు సంబంధించిన గోప్యతా ఉల్లంఘన కేసులో క్రైమ్ బ్రాంచ్ ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ కేసును మహారాష్ట్ర పోటీ పరీక్షల (దుష్ప్రవర్తనల నివారణ) చట్టం, 2024తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







కామెంట్‌లు (0)