శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలోనూ నిర్బంధం

1 గంట క్రితం

editedimage-1791640484066-7995.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 12:31 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • చలో లోక్‌ భవన్‌ను అడ్డుకున్న పోలీసులు

  • ఎక్కడికక్కడ నాయకుల అరెస్టులు

  • పార్టీ కార్యాలయాల ముందు భారీగా మోహరింపు

  • ఎయిర్ పోర్టు దగ్గర్లో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

సిఇసి జ్క్షానేష్‌‌కుమార్‌‌ను తొగించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు నిర్వహించిన చలో లోక్‌‌భవన్‌ ‌కార్యక్రమంపై పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఎక్కడికక్కడ నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఇళ్లలో నుండి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ముందస్తు గృహ నిర్బంధం ప్రయోగించారు. కార్యకర్తలను రోడ్లపై ఈడ్చిపడేశారు. సెల్‌‌ఫోన్లు లాక్కుని దూరంగా విసిరేశారు. సహనం కోల్పోయిన పోలీసులు బూతులు తిడుతూ నానా దుర్భాషలాడారు. అలంకార్‌ ‌సెంటర్‌ ‌వద్ద పోలీసులు మోకాళ్లతో గట్టిగా నొక్కడం, బస్సుల్లో ఎత్తివేయడంతో పలువురు గాయపడ్డారు. ముగ్గురు స్పృహ కోల్పోయారు. అపస్మారక స్థితిలో చేరుకున్న వారిని పోలీసులు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. ఆస్పత్రికి పంపించాలని కోరినా సిబ్బంది లేరని, తాము తీసుకెళ్లబోమని తెలిపారు. చివరకు సహచరులే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అక్కడ వైద్యులు చికిత్స అందించారు. వారిని సిపిఎం నాయకులు పరామర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిలను కేసరపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా అదుపులోకి తీసుకుంటూ నోటీసులిచ్చినా షర్మిల తీసుకోలేదు. కారుకు అడ్డుగా నిలబడి ముందుకు వెళ్లనీయ కుండా ఆపేసి అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు. అరెస్టు చేసిన సుమారు 500 మంది వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొత్తపేట, వన్‌‌టౌన్‌, సింగ్‌నగర్, నున్న, సత్యనారా యణపురం, కృష్ణలంక పోలీస్టేషన్‌లలో ఉంచారు.

చలో లోక్‌‌భవన్‌ ‌కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యాలయాల ముందు పోలీసులు భారీగా మోహరించారు. నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నామని ప్రకటించారు. మరోవైపు లెనిన్‌ ‌సెంటర్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అరెస్టు చేసిన వారిని తరలించేందుకు ప్రైవేటు బస్సులు, పోలీసు వ్యాన్లు, స్కూలు బస్సులను సిద్ధం చేసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిహెచ్‌.బాబూరావు, కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ మంత్రి జె.డి.శీలం, రాష్ట్ర పరిశీలకులు మోహన్‌, కొలనుకొండ శివాజీ, న్యూడెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, ఎం.రామకృష్ణ, ఎంఎల్‌ ‌పార్టీ నాయకులు కిషోర్‌బాబు, ఎస్‌‌యుసిఐసి నాయకులు సుధీర్‌, ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌‌బాషా, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అలంకార్‌ ‌సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. మోడీ, సిఇసికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని బలవంతంగా అరెస్టు చేశారు. అడ్డుకున్న కార్యకర్తలను ఈడ్చిపారేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారులు బూతులు తిట్టారు. కాళ్లు, చేతులు పట్టుకుని రోడ్డుపై ఈడ్చిపారేశారు. మహిళా కార్యకర్తలను కూడా లాగేశారు. అరెస్టులను వీడియో తీస్తున్న వారి ఫోన్లను లాక్కున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐపిఎస్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల తీరును ప్రశ్నించారు. మరోవైపు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, వి.రాంభూపాల్, సిపిఐ నాయకులు వనజ, సిపిఎం మాజీ కార్పొరేటర్‌ ‌బోయి సత్యబాబు తదితరులు నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసి తరలించారు. అరెస్టయిన వారిలో సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ, కొరవి వినయ్‌కుమార్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, మాల్యాద్రి, సావిత్రి, హరిబాబు, సూర్యారావు, నాయకులు దయా రమాదేవి, ఆర్‌‌వి నరసింహారావు ఉన్నారు. పోలీసుల తోపులాటలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి చేతికి తీవ్రమైన గాయమైంది. తూర్పుగోదావరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు జ్యోతి స్పృహ తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, ఏలూరు జిల్లా కార్యకర్త మాధవ్‌ను పోలీసులు గుండెపై తన్నటంతో గాయపడ్డారు. ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, లిబరేషన్ నాయకులు హరినాథ్ పాల్గొన్నారు.

నియంతృత్వ పాలన ఎంతోకాలం సాగదు :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అరెస్టు అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. నియంతృత్వ పాలన ఎంతోకాలం సాగదని అన్నారు. 13 కోట్ల మంది ఓట్లను తొలగించిన సిఇసిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే బలవంతంగా నిర్బంధం ప్రయోగించడం అప్రజాస్వామికమని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని అన్నారు. అనంతరం వేర్వేరు స్టేషన్లలో ఉన్న నాయకులను పరామర్శించారు.

పోలీసుల తీరు అన్యాయం: మాజీ మంత్రి వడ్డే, ఎబివి

ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెబితే పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం అన్యాయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐపిఎస్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు అన్నారు. ఇంత నిర్బంధం ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని, ఒకవేళ నిరసనలు, ప్రదర్శనకు అనుమతి లేకపోతే అన్ని పార్టీలకూ అదే పద్ధతి అనుసరించాలని అన్నారు. అధికార పార్టీలకు ఒకలా ప్రతిపక్ష పార్టీల పట్ల మరొకలా వ్యవహరించడం అన్యాయమని తెలిపారు.

నేడు రాష్ట్ర వ్యాపిత నిరసనలు.. పోలీసు నిర్బంధానికి ఖండన

చలో లోక్‌‌భవన్‌ కార్యక్రమంపైనా, ఢిల్లీలో పోలీసుల నిర్బంధానికి నిరసనగా ఆదివారం నాడు రాష్ట్రవ్యాపితంగా నిరసనలు తెలియజేయాలని ప్రజలు, ప్రజాతంత్రవాదులకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 13 కోట్ల ఓటర్లకు మరణ శాసనం రాసిన సిఇసి జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుండి తొలగించాలని, ఓట్లను హరించే ఎస్‌ఐఆర్‌‌ను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అఖిలపక్షాలు - ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్టులు చేయడాన్ని వామపక్షాలు ఖండించాయి. అర్ధరాత్రి నుండే గృహ నిర్బంధం చేసి, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించడాన్ని తీవ్రంగా నిరసించాయి.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్