అమెరికాలో ఆయన తనయుడు కిరణ్ మృతి
16న అంత్యక్రియలు
ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు ఎంఎ.గఫూర్, పి.నిర్మల దంపతుల పెద్ద కుమారుడు కిరణ్ (41) గుండెపోటుతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోసేలో మృతి చెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త విన్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అవివాహిడైన కిరణ్... అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని పేపాల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. ఈ నెల ఒకటిన తన గదిలో ఉండగా గుండెపోటు రావడంతో అపార్టుమెంట్‌లోని వారు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియలేదు. ఈ నెల తొమ్మిదిన కంపెనీ వారు ఫోన్ చేసి కిరణ్ ఆఫీసుకు రావడం లేదని కుటుంబసభ్యులకు చెప్పారు. గత పది రోజులుగా కిరణ్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఈ సమాచారం నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అమెరికాలోని తెలుగు స్వచ్ఛంద సంస్థలైన అమనా (AMANA), తానా (TANA) ప్రతినిధులను సంప్రదించారు. ఆ సంస్థల ప్రతినిధులు విచారణ జరిపి కిరణ్ మృతి చెందినట్లు తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ రాత్రికి భౌతికకాయం కర్నూలుకు రావచ్చని, 16న అంత్యక్రియలు నిర్వహిస్తామని గఫూర్ తెలిపారు. సిపిఎం, సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులు ఫోన్ చేసి గఫూర్‌ను పరామర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితరెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి, పలు రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఎంఎ.గఫూర్, పి.నిర్మలను కలిసి ఓదార్చారు.









కామెంట్‌లు (0)