తరువాత రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలి
2 రోజుల్లో నియోజకవర్గానికి రూ.కోటి విడుదల
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : నవంబరు 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన సహచర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో విస్తృతంగా పనిచేయాలని, అనంతరం రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్ళాలని సూచించారు. మొత్తం అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు పనిచేయాలన్నారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లు ఉంటే దానిని కదిలించింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని, దానిని హైకోర్టు కొట్టివేస్తే జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లలేదని పేర్కొన్నారు. ఇప్పుడు 34 శాతం బిసిలకు రిజర్వేషన్లు ఇస్తామంటే అది అమలుకాకుండా కోర్టుకు వెళ్ళారని ఆరోపించారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో బిసిలకు సాధ్యమైనంత ఎక్కువ రిజర్వేషన్లు ఇద్దామన్నారు. అధికారికంగా 27 శాతమే అయినప్పటికీ పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు ఇద్దామని చెప్పారు. కాగా, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్ కోసం కొత్తగా రోస్టర్ తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో జిల్లా పరిషత్తులు పెరగడం వల్ల రోస్టర్ అవసరమని వివరించారు. ఎల్‌నినోపైనా సూచనలు చేశారు. రాష్ట్రంలో 34 శాతం లోటు వర్షపాతం ఉన్నప్పటికీ గతేడాది నీటిని నిల్వ చేసుకోవడం వల్ల ఈ ఏడాది కొంతవరకు బయటపడ్డామని సిఎం చంద్రబాబు తెలిపారు.
మంత్రులు ప్రేక్షకులుగా ఉండవద్దు
పరిపాలనలో మంత్రులు ప్రేక్షకులుగా ఉండొద్దని సిఎం చంద్రబాబు హితవు పలికారు. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. కేంద్రంలో మీకు సంబంధం ఉన్న శాఖల మంత్రితో టచ్‌లో ఉండాలని ఆదేశించారు. ఏమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులిస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున సోమ, మంగళవారాల్లో విడుదల చేస్తామని తెలిపారు.







కామెంట్‌లు (0)