శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ మంత్రి భూ ఆక్రమణలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి

2 గంటల క్రితం

lokanatam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 01:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రెండు సిట్ నివేదికలు బహిర్గతం చేయాలి

  • సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు లోకనాథం డిమాండ్

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ జిల్లాలోని ఎండాడ,మధురవాడ,కొమ్మాది ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణకు ఆదేశించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడిన వారిపై ప్రభుత్వ యంత్రాంగం ఉదారంగా వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణారావుతో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎండాడ ప్రాంతంలో రూ.600కోట్ల విలువైన 30ఎకరాల భూమిని ఆక్రమించిన మాజీ మంత్రిపై కేసులు నమోదుచేయాలన్నారు.విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో 1.30లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారుపై 2017లో ఆనాటి టిడిపి ప్రభుత్వం,తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 2019లో మరో సిట్ ఏర్పాటు చేసినా,సిట్ నివేదికలు బయట పెట్టకుండా ఆక్రమణదారులను కాపాడాయని విమర్శించారు.ఇప్పటికైనా రెండు సిట్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుండా వారి భూములను రెగ్యులరైజ్ చేయడంతో ఇష్టారాజ్యంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు.పేదల డి పట్టా భూములు,మాజీ సైనికులకు కేటాయించిన భూములను లక్ష్యంగా చేసుకొని అక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ భూములకు ప్రభుత్వ అధికారులే ఎన్ ఓ సి లు జారీచేసి ప్రోత్సాహించారని తెలిపారు.గతంలో విశాఖ రూరల్ తహశీల్దార్ పై భూ కబ్జాదారులు దాడిచేసి హత్యచేశారని గుర్తు చేశారు.

ఒకవైపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,అభివృద్ధికి కావాల్సిన ప్రభుత్వ భూములను కాపాడ్డంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయన్నారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.ప్రభుత్వ భూముల్లో గత 20ఏళ్ల నుంచి పాకలు వేసుకొని జీవిస్తున్న పేదల స్థలాలను రెగ్యులర్ చేయడానికి అనేక షరతులు పెడుతున్న ప్రభుత్వం,కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాచేస్తున్న వారి భూములను రెగ్యులర్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడినవారు ఎంతటివారైనా వారి నుంచి ఆక్రమిత భూములు స్వాధీనంచేసుకొని,కేసులు నమోదుచేయాలన్నారు.ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణకు ఆదేశించి,ప్రభుత్వ భూములు కాపాడే చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్