కాస్టింగ్ కౌచ్ : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై ఎన్నో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. చాలామంది భయంతో బయటకు చెప్పకుండా మౌనం పాటిస్తుంటే, కొంతమంది మాత్రం సమయం వచ్చినప్పుడు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సినీనటి పరిణీత బోర్తకుర్ కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరిణీత బోర్తకుర్ సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకొని వెల్లడించారు. మీకు సినీ రంగంలో చేదు అనుభవాలు ఉన్నాయా ? అని యాంకర్ ప్రశ్నించగా .... ఓ చేదు అనుభవాన్ని తాను కూడా ఎదుర్కొన్నానని ఆమె బదులిచ్చారు. అయితే ఈ పరిశ్రమలో ఒక మంచి విషయం కూడా ఉందని ... ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రవర్తన కూడా కీలకంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఒక దక్షిణాది సినిమా కోసం తన ఫొటోలు షార్ట్‌లిస్ట్ అయ్యాయని సమాచారం వచ్చిందని పరిణీత చెప్పారు. ఆ తర్వాత ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ మరికొందరు అభ్యర్థులు కూడా ఉన్నారని తెలిపారు. కొంతసేపటి తర్వాత తననే హీరోయిన్‌గా ఎంపిక చేశామని చెప్పి ఒప్పందంపై సంతకం చేయాలని కోరారని వివరించారు. ఆ సమయంలో అంతా సాధారణంగానే అనిపించిందని, సినిమా అవకాశం రావడంతో ఆనందపడ్డానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన మాత్రం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆమె చెప్పారు. మొదట తన శరీర కదలికలు తెలుసుకోవాలని దర్శకుడు చెప్పడంతో డ్యాన్స్‌కు సంబంధించిన విషయమే మాట్లాడుతున్నారని భావించానని తెలిపారు. కానీ వెంటనే మన ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలని కోరుకుంటున్నానని అతను చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానన్నారు. అప్పటికి తన వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమేనని... భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైందని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడి తాను ఆ సినిమా చేయనని చెప్పి బయటకు వచ్చేశానని వెల్లడించారు.
ఆ మాటలకు షాకయ్యా.. సినిమా చేయనని వచ్చేశా : పరిణీత బోర్తకుర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 01:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)