శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలు నేటి తరం యువతకు ఆదర్శం

1 గంట క్రితం

Kakinada Collector
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 01:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్

ప్రజాశక్తి-కాకినాడ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమ, త్యాగ నిరతి నేటి తరం యువతకు ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ కోరారు. స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, ఎంపి సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కౌడా చైర్మన్ తలాటం సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, ప్రజాప్రతినిధులు, క్షత్రియ సమాజ పెద్దలు స్ధానిక నాగమల్లితోట జంక్షన్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచిత పోరాటాలతో తెల్లదొరల గుండెల్లో నిద్రపోయి, మన్యం ప్రజల హక్కుల కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నిస్వార్ధ త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అల్లూరి ఆదర్శంగా సమాజంలో ప్రతి పౌరుడికి హక్కులు కల్పించేందుకు, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాడు అడవులను అల్లూరి ఎలా సంరక్షించారో, నేటి తరం కూడా అదే స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలందరికీ అల్లూరి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ గిరిజనుల, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి దేశ స్వాతంత్ర్యానికి దిక్సూచిగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అల్లూరి ఆశయాలకు కట్టుబడి ఉందన్నారు. అమరావతిలో అల్లూరి చరిత్రను భావితరాలకు తెలియజెప్పేలా భూమిని కేటాయించడం, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా నామకరణం చేయడం అల్లూరి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. క్షత్రియ సామాజిక వర్గ సంక్షేమానికి, వారి సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటోందని, రాజకీయంగా కూడా పెద్దపీట వేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ప్రణాలర్పించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నిరుపమాన త్యాగాన్ని జాతి ఎన్నటికీ మరువదని ఎంపి సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ వి. సతీష్ కుమార్ స్థానిక నాయకులు, క్షత్రియ అసోసియేషన్ ప్రతినిధులు, నగర ప్రముఖులు, యువత, విద్యార్ధులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్