శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌ నేతల హత్యకు కుట్ర అన్న కథనం అవాస్తవం : ఇజ్రాయెల్ ఖండన

1 గంట క్రితం

Israel denies reports of a plot to assassinate Iranian leaders.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇజ్రాయెల్ : శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్ కీలక ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం హత్యాయత్నానికి ప్రణాళిక రూపొందించిందంటూ అమెరికా మీడియా ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా నిరాధారమని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ... ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళిక రూపొందించిందని పేర్కొంది. ఈ విషయం ముందుగానే గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు సమాచారం అందించినట్లు కూడా ఆ కథనం వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ పూర్తిగా తోసిపుచ్చింది. "ఇరాన్ చర్చల ప్రతినిధులను లక్ష్యంగా చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం పూర్తిగా కల్పితం. అందులో వాస్తవాలకు ఏమాత్రం తావు లేదు" అని ఇజ్రాయెల్ 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. ఏప్రిల్‌లో ప్రారంభమైన శాంతి చర్చల సమయంలో ఇరాన్ ప్రతినిధులపై దాడి జరిగితే చర్చలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉందని అమెరికా భావించినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కథనం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో దీనిపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్