శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు వ్యతిరేక విధానాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలి : ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు టి.సాగర్

2 గంటల క్రితం

రైతు వ్యతిరేక విధానాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలి : ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు టి.సాగర్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 01:36 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేత..

  • ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభ ప్రారంభ ఉపన్యాసం ప్రసంగం చేసిన అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ ఉపాధ్యక్షులు టి.సాగర్


ఏలూరు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక, వ్యవసాయ విధానాలు దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ ఉపాధ్యక్షులు టి.సాగర్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు రెండవ రోజు శనివారం ఏలూరులోని కామ్రేడ్ బడా సుబ్బారెడ్డి కామ్రేడ్ వై జోయ్ మహాసభ ప్రాంగణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభ ప్రారంభ సూచికగా ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు టి సాగర్ ప్రారంభ ఉపాన్యాసం చేశారు.


మోడీ ప్రభుత్వం విదేశీ వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి నూనెగింజలు, వంటనూనెలు, పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తుల దిగుమతులకు సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టి.సాగర్ అన్నారు. ఇప్పటికే వంట నూనెకు 27 శాతం ఉండగా అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వ్యాన్స్ పర్యటనలో భాగంగా 17 శాతం పన్ను తగ్గించారని దీని వల్ల విదేశాల నుండి నూనె దిగుమతైతే దేశంలో పండించే ఆయిల్ ఫాo,వేరుశెనగ, నువ్వులు, సన్ ఫ్లవర్ కొబ్బరి వంటి పంటలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా పత్తి 11శాతం పన్ను తీసివేస్తున్నారని దీనివల్ల మన దేశానికీ 40 లక్షల వేల పత్తి దిగుమతైతే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణాలో పంటలు పండించే రైతులు నష్టాలలో కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పాల ఉత్పత్తిదారులు 10 కోట్ల మంది పాడి రైతులు ఉంటే విదేశాల్లో ఉన్న పాలను దిగుమతి చేసుకునేలా ఒప్పందం చేశారన్నారు. పాడి రైతులతో పాటు సహకార సంఘాలు, అమూల్, హెరిటేజ్, విశాఖ డైరీ, సంఘం డైరీ ఇలాంటి వాటితో పాటు కోట్ల కుటుంబాలు రోడ్లపై వచ్చేలా ఒప్పందాలు ఉన్నాయన్నారు. మొక్కజొన్నకు ప్రస్తుతం ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ నిర్ణయాలు మరింత దెబ్బతీస్తున్నాయని వివరించారు.


ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావంతో చమురు, గ్యాస్ ధరలు పెరిగి వ్యవసాయ పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందన్నారు. డీజిల్, ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతుండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజల జీవనం కష్టతరమైందని టి.సాగర్ తెలిపారు.

దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, అన్నదాతలైన రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. దేశానికి ఆహారం పండించే రైతులను నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగించడం దురదృష్టకరమని అన్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడానికి కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణ విముక్తి చట్టం తరహా విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తి రుణమాఫీ, గిట్టుబాటు ధరలకు చట్టబద్ధ హామీ, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, వ్యవసాయ పెట్టుబడుల నియంత్రణ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు. రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు కలిసి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు అవసరం అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను ఏలూరులో విజయవంతంగా నిర్వహించిన జిల్లా కమిటీ, ఆహ్వాన కమిటీ, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు నాయకులను అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సాగర్ ప్రత్యేకంగా అభినందించారు. మహాసభల విజయంతో రైతు ఉద్యమాలకు కొత్త ఉత్సాహం లభించిందని, రైతాంగ హక్కుల సాధన కోసం మరింత విస్తృత ఉద్యమాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో రైతు కూలీ సంఘం జాతీయ నాయకురాలు ఝాన్సీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు సౌహార్ధ సందేశాలు ఇచ్చారు కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం

సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్