- సిఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికోకు నో ఎంట్రీ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పత్రికా స్వేచ్ఛపై అణిచివేతకు పాల్పడింది. ‘అసత్య కథనాలు’ ప్రసారం చేస్తున్నాయంటూ ప్రముఖ వార్తా సంస్థలు అయిన సిఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో ప్రతినిధులను ఇక నుంచి వైట్ హౌస్‌లోకి అనుమతించబోమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక శనివారం నాడు ప్రకటించారు. త్వరలోనే మరిన్ని మీడియా సంస్థలపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనపై సిఎన్‌ఎన్ తీవ్రంగా స్పందించింది. తమ వైట్‌హౌస్ బృందం న్యాయబద్ధంగా, కచ్చితమైన వార్తా కథనాలను అందిస్తోందని పేర్కొంది. అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ కల్పించిన హక్కుల ప్రకారం ప్రభుత్వ జోక్యం లేకుండా వార్తలు రాసే హక్కు తమకు ఉందని తెలిపింది. నిషేధం అమలులోకి వస్తే అది రాజ్యాంగ హక్కుపై చట్టవిరుద్ధమైన దాడి అవుతుందని హెచ్చరించింది. పొలిటికో కూడా తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు చట్టపరంగా పోరాడతామని ప్రకటించింది. ట్రంప్ చర్య మీడియాతో ఆయనకు కొనసాగుతున్న ఘర్షణలకు మరో ఉదాహరణగా నిలిచింది. గతేడాది అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) విలేకరులను ఓవల్ ఆఫీస్, ఎయిర్‌ఫోర్స్ వన్, ఇతర కార్యక్రమాలకు అనుమతించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)