శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రపతి ఎడిసిగా మేజర్ నవ్య షెకావత్

1 గంట క్రితం

murmu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- తొలి మహిళా ఆర్మీ అధికారిగా రికార్డు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎడిసిగా మేజర్‌ నవ్య నియమితులయ్యారు. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి ఆర్మీ మహిళా అధికారిగా, అలాగే రెండో మహిళా అధికారిగా ఆమె రికార్డు సృష్టించారు. 2025లో ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆర్మీ నుంచి నవ్య షెకావత్ ఆ పదవిలో నియమితులయ్యారు. ఈ ఏడాది జులైలో ఈ నియామకం జరగ్గా, ప్రస్తుతం ఆమె రాష్ట్రపతి భవన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని కెర్పురా గ్రామానికి చెందిన మేజర్ నవ్య షెకావత్‌ది పూర్తిగా సైనిక కుటుంబం. నవ్య కుటుంబం మూడు తరాల వారు సైన్యంలో పనిచేశారు. ఆమె తాత భన్వర్ సింగ్ షెకావత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె తండ్రి గ్రూప్ కెప్టెన్ కరణ్ సింగ్ షెకావత్ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లోనే ఉన్నత హోదాలో సేవలు అందిస్తున్నారు. మూడో తరమైన నవ్య ప్రస్తుతం ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు.

రాష్ట్రపతి అధికారికంగా పాల్గొనే పర్యటనలు, సమావేశాలు, పరేడ్‌లు, ముఖ్యమైన కార్యక్రమాల్లో రాష్ట్రపతికి సహాయకులుగా ఉండే ప్రత్యేక సైనిక అధికారులనే 'ఏడీసీ' అంటారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రతి కార్యక్రమం సజావుగా జరిగేలా చూసుకోవడం వీరి ప్రధాన బాధ్యత. సాధారణంగా రాష్ట్రపతికి సహాయకులుగా ఐదుగురు ఎడిసిలు ఉంటారు. వీరిలో ముగ్గురు ఆర్మీ నుంచి, ఒకరు నేవీ నుంచి, మరొకరు ఎయిర్‌ఫోర్స్ నుంచి ఎంపికవుతారు. ఇప్పుడు ఆర్మీ నుంచి ఎంపికైన వారిలో మేజర్ నవ్య ఒకరు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్