- బిజెపి ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.55 లక్షలు మాయం
లక్నో : బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో సైబర్ మోసగాళ్లు హడలెత్తిస్తున్నారు. ఏకంగా బిజెపి రాష్ర్ట ఉపాధ్యక్షులు, చైల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పూజా పాల్ బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. 1.55 లక్షలను మాయం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 మధ్య ఫోన్‌పే, యూపిఐ ద్వారా అనేకసార్లు ఈ మొత్తాన్ని దొంగలించారు. ఈ నెల 14న పూజా పాల్ ఈ విషయాన్ని గుర్తించారు. బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తున్న సమయంలో తనకు తెలియకుండా జరిగిన అనేక లావాదేవీలను ఎమ్మెల్యే కొనుగొన్నారు. ఈ విషయంపై శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎమ్మెల్యేకు ఎకౌంట్ ఉంది. తన ఐఫోన్ 17 ఎయిర్‌ను హ్యాక్ చేసి, తన బ్యాంకింగ్, వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో ఆరోపించారు. అలాగే చోరీ అయిన సొమ్మును తిరిగి రాబట్టాలని ఎమ్మెల్యే కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఎదురయితే సామాన్యుల గతి ఏమిటినే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.







కామెంట్‌లు (0)