@అమెరికా సైనిక స్థావరాలకు ఓకే
@‘‘కల నెరవేరింది’’ అన్న ట్రంప్
వాషింగ్టన్: ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్‌లాండ్‌పై అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ద్వీపంలో అమెరికా తన సైనిక స్థావరాలను గణనీయంగా పెంచుకోవచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒప్పందానికి ముగింపు తేదీ లేదని, గ్రీన్‌లాండ్‌ను రక్షించే హక్కు అమెరికాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే గ్రీన్‌లాండ్ నియంత్రణ అమెరికా చేతికి రాదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ట్రంప్ ఏమన్నారంటే?
ఒప్పందం కోసం డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లతో వాషింగ్టన్ సన్నిహితంగా పనిచేసిందని ట్రంప్ తెలిపారు. గ్రీన్‌లాండ్ భద్రత కోసం అమెరికా సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తుందన్నారు. దీంతో అమెరికా కల నెరవేరిందని ట్రంప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ సంపూర్ణంగా, శాశ్వతంగా ఉంటుందని, ప్రత్యర్థులెవరినీ ఆ ప్రాంతంలోకి రానివ్వబోమని ట్రంప్ ప్రకటించినట్లు వైట్‌హౌస్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా ప్రత్యర్థి దేశాలు గ్రీన్‌లాండ్‌లో సైనిక స్థావరాలు నిర్మించకూడదు. మరోవైపు, అక్కడ తన సైనిక స్థావరాలను స్వేచ్ఛగా విస్తరించుకునేందుకు అమెరికాకు అవకాశం లభిస్తుంది. అయితే ఇదేమి కొత్తదికాదు. 1951లో కుదిరిన ఒప్పందం ప్రకారం గ్రీన్‌లాండ్‌లో విమానాలు నడపడానికి, స్థావరాలు వాడుకోవడానికి అమెరికాకు ఇప్పటికే విస్తృత హక్కులున్నాయి. ద్వీపం వాయవ్య ప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో ఇప్పటికే ఉన్న ఒక స్పేస్ ఫోర్స్ స్థావరానికి తోడు, భారీ సైనిక నిర్మాణం రాబోతోందని ట్రంప్ సూచనప్రాయంగా చెప్పారు. అయితే, డెన్మార్క్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందం ఉత్తర అట్లాంటిక్, విస్తృత ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేస్తుందని డెన్మార్క్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఒప్పందం గ్రీన్‌లాండ్ ప్రయోజనాలను, ప్రపంచ వేదికపై దాని పాత్రను గౌరవిస్తోందని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడెరిక్ నీల్సన్ అన్నారు. అయితే, ఈ ఒప్పందం ఫలితంగా అమెరికా నిజంగా కొత్త స్థావరాలు నిర్మిస్తుందా అనే విషయంతో సహా చాలా అంశాలపై స్పష్టత లేదని, ఇలాంటి ఒప్పందాల గురించి సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ తరచూ పోస్టులు పెడుతుంటారని, వాటిలో నిజాల్ని నిర్థారించాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.







కామెంట్‌లు (0)