- ఉల్లంఘనలకు పాల్పడినా బాధ్యులపై కఠిన చర్యలు
- పరిశ్రమలకు వర్క్ ఫోర్స్ సిద్ధంచేయాలి
- సమీక్షలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ చాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భర్తీ ప్రక్రియలో ఎటువంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధ్యాపక పోస్టుల కోసం 1,90,509 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 1,51,836 మాత్రమే అర్హత సాధించాయని అధికారులు మంత్రికి తెలిపారు. అర్హతపై ఈ నెల 21 నుంచి 27వ తేది వరకు గ్రీవెన్స్ నిర్వహించి అర్హుల తుదిజాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల అడ్మిషన్లను సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో యుజిసి నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేశారు.
జాబ్ మేళాల ద్వారా 1.37లక్షలమందికి ఉద్యోగాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1.37లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని మంత్రి తెలిపారు. యువతకు మరింత సౌలభ్యంగా ఉండేలా జాబ్ మేళాలను నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి ఐటిఐని పరిశ్రమలకు అనుసంధానించి, యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారు, స్కిల్ గ్యాప్ భర్తీపై నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి 81 ఆపరేషనలైజ్ ఇండస్ట్రీ అకడమిషియా పార్టనర్ షిప్స్‌ను సిద్ధం చేశామని చెప్పారు. నైపుణ్యం పోర్టల్ ను యువతకు ఉపయోగకరంగా తీర్చిదిద్ది, వచ్చేనెలలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఎన్ రోల్ మెంట్ ఆధారంగా మొదటి సంవత్సరం నుంచే వివిధ ఉద్యోగాలు, వాటికి కావాల్సిన స్కిల్స్ సమాచారం, కెరీర్ గైడెన్స్ వివరాలతో నైపుణ్యం పోర్టల్ ద్వారా అప్ డేట్స్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 169 ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో ప్లేస్ మెంట్ సెల్స్ ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ సిఇఓ గణేష్ కుమార్, సీడాప్ సిఇఓ నారాయణస్వామి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్. విజయభాస్కర్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)