ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రగతిశీల శక్తులకు క్యూబా స్ఫూర్తి

1 గంట క్రితం

cpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కె రామకృష్ణ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : క్యూబా విప్లవం ప్రపంచంలోని కమ్యూనిస్టు, ప్రగతిశీల శక్తులకు నిరంతర స్ఫూర్తినిస్తోందని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. క్యూబాలో జరుగుతున్న 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మిక పార్టీల సమావేశంలో సిపిఐ తరఫున ఆదివారం ప్రసంగించారు. ఆరు దశాబ్దాలకు పైగా అమెరికా సామ్రాజ్యవాద ఒత్తిళ్లు, ఆంక్షలను ఎదుర్కొంటూ సోషలిజాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న క్యూబా ప్రజల ధైర్యం, త్యాగాలను అభినందించారు. 2026లో ఫిడెల్ కాస్ట్రో శతజయంతి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.ఫిడెల్ కాస్ట్రో కేవలం క్యూబాకు చెందిన నాయకుడు మాత్రమే కాదని, ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల ప్రజలకు చెందిన గొప్ప అంతర్జాతీయవాది, మార్క్సిస్టు, లెనినిస్టు, సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ నాయకుడని కొనియాడారు. క్యూబా విప్లవం విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగం, బయోటెక్నాలజీ, సామాజిక న్యాయం వంటి రంగాల్లో సాధించిన విజయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆర్థిక దిగ్బంధనం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్యూబా తన ప్రజలకు ఉచిత వైద్యం, సార్వత్రిక విద్య, సామాజిక భద్రతను అందించడం ద్వారా సోషలిజం శక్తిని నిరూపిస్తోందన్నారు.ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా తదితర ప్రాంతాల్లో విముక్తి ఉద్యమాలకు క్యూబా అందించిన సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. అమెరికా, దాని మిత్రదేశాల ఆధిపత్య రాజకీయాలు, సైనిక జోక్యాలు, ఏకపక్ష ఆంక్షలు, వాణిజ్య యుద్ధాలు, ఆయుధీకరణ ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్