విజయవాడ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల స్లాబులు దెబ్బతిని పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చేపడుతున్న సహాయ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్. బాబురావు విమర్శించారు. నగరంలోని అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురంలోని ఎల్‌బీఎస్ నగర్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ నగర్ (కండ్రిక కాలనీ) తదితర ప్రాంతాల్లో గురువారం సిపిఎం నేతలతో కలిసి బాబురావు పర్యటించారు. ఇళ్లలోకి నీరు చేరి కంటిమీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లను, ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు భారీ వర్షాలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విజయవాడలో సాధారణ వర్షాలకే ప్రధాన రహదారులు, లోబ్రిడ్జిలు, కాలనీలు మునిగిపోతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. గతంలో కాలువల నిర్మాణానికి రూ.460 కోట్లు మంజూరైనా, సంవత్సరాలు గడుస్తున్నా సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడం గర్హనీయమన్నారు. పేదలు నివసించే ప్రాంతాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన పలు కాలనీల్లో ఇళ్ల స్లాబులు దెబ్బతిని పెచ్చులు ఊడిపడుతున్నా పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదన్నారు. నగరపాలక సంస్థ, ప్రభుత్వం పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై చూపడం లేదని విమర్శించారు. రెండేళ్ల క్రితం బుడమేరు వరదలతో నగరం తీవ్రంగా నష్టపోయినా ముంపు నివారణకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ముంపు ప్రాంతాల్లో వెంటనే భోజన సదుపాయాలు కల్పించాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగర డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణానికి రూ.1,000 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. బుడమేరు ముంపు నివారణకు అధికారులు రూపొందించిన నివేదికలను ఆమోదించి అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పర్యటనలో సీపీఎం నేతలు బి. రమణారావు, సీహెచ్. శ్రీనివాస్, నిజాముద్దీన్, పీర్‌సాహెబ్, అప్పన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు అతలాకుతలమైన జనజీవనం
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)