కడుపునొప్పితో విద్యార్థులకు అస్వస్థత.. 108లో పీహెచ్‌సీకి తరలింపు
ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హామీ
ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : మండలంలోని చిక్కనపల్లి ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు వేపాకు, జీలకర్ర తినిపిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ప్రతిరోజూ వేపాకు, జీలకర్ర తింటే ఎలాంటి అనారోగ్యం రాదంటూ విద్యార్థులను నమ్మించి వాటిని తినిపిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులకు కడుపునొప్పి రావడంతో 108 వాహనం ద్వారా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పీహెచ్‌సీలో వైద్యులు విజయచంద్ర విద్యార్థులకు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ-2 దేశమ్మ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉపాధ్యాయుడు గిరిరాజు వేపాకు, జీలకర్ర తింటే ఎలాంటి రోగాలు రావని చెబుతూ ప్రతిరోజూ వాటిని తినిపిస్తున్నారని తెలిపారు. దీంతో ఇంటి నుంచి తీసుకొచ్చిన అన్నంతో పాటు పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం కూడా తినలేకపోతున్నామని, కొన్నిసార్లు వాంతులు అవుతున్నాయని విద్యార్థులు చెప్పినట్లు సమాచారం.
“పిల్లలను పాఠశాలకు పంపితే.. ఇలా చేస్తారా?”
విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ పిల్లలను చదువుకోవడానికి పాఠశాలకు పంపిస్తున్నామని, పాఠశాలలో ఏం జరుగుతుందో తమకు ఇప్పటివరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు వేపాకు, జీలకర్ర తినిపిస్తున్న విషయం ఇప్పుడు మాత్రమే తెలిసిందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇలాంటి పదార్థాలను బలవంతంగా తినిపించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
తప్పేనని అంగీకరించిన ఎంఈఓ
ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి-2 దేశమ్మను వివరణ కోరగా.. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వేపాకు, జీలకర్ర తినిపించడం సరైన పద్ధతి కాదని, ఉపాధ్యాయుడు చేసినది తప్పేనని తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టి త్వరలో సంబంధిత ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు భంగం కలిగించే చర్యలు పాఠశాలలో పునరావృతం కాకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.









కామెంట్‌లు (0)