గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

48 గంటల్లోగా సిఇసి రాజీనామా చేయాలి : అభిజీత్‌ దీప్కే

45 నిమిషాల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 48 గంటల్లోగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. లేదంటే జంతర్‌ మంతర్‌ 2.0 పేరుతో మరో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాత ఎన్నికలను నిర్ధారించడానికి సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించబడ్డాయని దీప్కే పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో ఓటర్ల జాబితాలో మార్పులు చేయడం ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉందా అని ప్రశ్నించారు. జ్ఞానేష్‌ కుమార్‌ సిఇసిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు ఓటు వేయాలి, ఎవరు ఓటు వేయకూడదన్న విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి ఏర్పడిందని దీప్కే మండిపడ్డారు. 13 కోట్లకు పైగా ఓట్ల తొలగింపు మొత్తం ఓట్లలో సుమారు 13 నుంచి 14 శాతానికి సమానమని ఆయన పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న సుమారు రెండు శాతం ఓట్ల వ్యత్యాసాన్ని పెంచే ఉద్దేశంతోనే ఓట్ల తొలగింపులు జరిగాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష‍ాల నియోజకవర్గాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్లు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నియోజకవర్గం నుంచి 40 వేల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. కేరళలోనూ ఓట్ల తొలగింపు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విజయాన్ని ప్రభావితం చేసిందని అన్నారు. ఇవి యాదృచ్ఛికంగా జరిగిన చర్యలు కావని, ఓట్ల తొలగింపులో ఒక నిర్దిష్ట విధానం కనిపిస్తోందని దీప్కే అన్నారు. బలమైన ప్రతిపక్ష నేతలను రాజకీయంగా బలహీనపర్చడమే దీని వెనుక ఉద్దేశమా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి ఏర్పడితే అటువంటి ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలుగా ఎలా పరిగణిస్తామని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లోగా సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ‘జంతర్‌ మంతర్‌ 2.0’ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్