మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపంచ గ్రామాల భూ సమస్యపై ధర్నా

1 రోజు క్రితం

Vepagunta Panchagramalu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 06:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పరిష్కరించకపోతే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ‘కూటమి’కి బుద్ధి చెబుతాం

ప్రజాశక్తి- వేపగుంట (విశాఖ) : పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారాన్ని కోరుతూ సమైక్య, ప్రజా రైతు సంక్షేమ సంఘం (పంచ గ్రామాల భూముల కమిటీ) ఆధ్వర్యంలో వేపగుంటలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విబిఎన్.ప్రతాప్, టివి.కృష్ణంరాజు, సిహెచ్.గోపాలకృష్ణ, పివిఎస్ఎల్ఎన్.శాస్త్రి, రమణి, సిపిఎం జోన్‌ ‌కార్యదర్శి బి.జగన్, చింతల అగ్రహారం మాజీ ఉప సర్పంచ్ పివి.రమణ మాట్లాడుతూ 1996 -97 వరకు పంచ గ్రామాలలో ఏ సమస్యా లేని భూములను సింహాచలం దేవస్థానానికి ముడిపెట్టి సమస్యాత్మకం చేసిన అప్పటి ప్రభుత్వం వల్ల నేటికి 26 సంవత్సరాలు పైబడినప్పటికీ, ఎన్ని ప్రభుత్వాలు మారినా, పంచ గ్రామాల ప్రజలకు ఎటువంటి పరిష్కారమూ లభించలేదన్నారు.

2014లో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వంద రోజులలో ఈ సమస్యను పరిష్కరిస్తానని నారా చంద్రబాబునాయుడు ఆంధ్రా యునివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా జరిగిన మొట్ట మొదటి సమావేశంలో చెప్పినా ఆయన ఐదేళ్ల కాలం గడిపేశారు తప్ప పరిష్కారం చూపలేదని గుర్తు చేశారు. మరల 2024లో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారని గుర్తుచేశారు. సంవత్సరాల తరబడి సమస్య హైకోర్టులో ఉందని అని చెప్పుకుంటూ రెండున్నర సంవత్సరాల కాలం గడిపారని విమర్శించారు. రాబోయే జివిఎంసి మేయర్, కార్పొరేటర్ ఎన్నికలలో సుమారుగా 20 కార్పొరేషన్ల పరిధిలో టిడిపి తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల గెలుపు ఓటములను పంచ గ్రామాల ప్రజలే నిర్ణయిస్తారని ఘంటాపథంగా చెబుతున్నామన్నారు. గూగుల్ డేటా సెంటర్లకు, ఇతర ఐటి కంపెనీలకు వందల ఎకరాల దేవస్థానం భూములను ధారాదత్తం చేస్తున్నారుగానీ పంచ గ్రామాలలోని సుమారు లక్ష మంది ప్రజల సమస్యను తీరుద్దామని ఈ ప్రభుత్వానికి ఏకోశానా లేదని విమర్శించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలోపు పంచ గ్రామాల సమస్యను పరిష్కరించకపోతే టిడిపి కూటమి అభ్యర్థులను ఓడించడం తథ్యమని నాయకులు చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలపై పంచ గ్రామాల ప్రజలందరూ ఏకోన్ముఖంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల నాయకులు సిహెచ్.సత్యనారాయణ, బి.శంకర్రావు, వి.నారాయణరావు, బి.ప్రకాష్, ఎస్‌వి.రమణ, కృష్ణారావు, టిజెఎస్ఎల్‌వి.శ్రీనివాస్, వైజెఎన్ ఓంశివ, ఎస్.రాజు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్