ప్రజాశక్తి-అమరావతి: ఆదివాసీల దీర్ఘకాలిక హక్కులకు భంగం కలుగుతున్న నేపథ్యంలో 1/70 చట్టాన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థించాలని, రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని, ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెం. 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, సభలు జరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. నేడు రంపచోడవరంలో నిర్వహిస్తున్న ర్యాలీ, సభకు పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించి ప్రజలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రంపచోడవరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు, ముఖ్యంగా యువత ప్రశాంతంగా సభకు వస్తున్న సమయంలో వారిని మార్గమధ్యంలో అడ్డుకుని రెచ్చగొట్టడం ద్వారా ఏజెన్సీలో అశాంతి పరిస్థితులను ప్రభుత్వమే సృష్టిస్తోందని విమర్శించారు. ఆదివాసీ యువతలో నెలకొన్న అసంతృప్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి సమస్యలను విని ఈ నెల 24న ముఖ్యమంత్రి రంపచోడవరం పర్యటన సందర్భంగా స్పందించి పరిష్కరిస్తే ఆందోళనలకు తెరపడుతుందని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్బంధ చర్యలకు పాల్పడడం అవివేకమని అన్నారు.
అలాగే, 24న ముఖ్యమంత్రి సభకు కూడా ఇదే విధంగా ప్రజలను అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ కార్యక్రమాలకు పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తూ, ఆదివాసీ సంఘాల కార్యక్రమాలపై మాత్రం నిర్బంధం ప్రయోగించడం దారుణమని విమర్శించారు. రంపచోడవరం సభ ప్రశాంతంగా జరిగేలా వెంటనే హోంమంత్రి, డీజీపీ జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)