- బిజెపి పాలనలో విద్యా వ్యవస్థ విధ్వంసం
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
- ఉద్యమ సంఘీభావ సభలో వి.శ్రీనివాసరావు, జి.ఈశ్వరయ్య
ప్రజాశక్తి- ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ప్రధాని మోడీ పాలనలో దేశంలోని విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురవుతోందని, ఢిల్లీలో పోలీసుల దాష్టీకం దేశానికి ప్రమాదకరమని వామపక్ష నేతలు అన్నారు. నీట్ ప్రశ్న ప్రతాల లీకేజి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రముఖ పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్షపై కేంద్ర నిర్బంధాన్ని ఖండిస్తూ, ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి, యువజన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ సోమవారం రాత్రి విజయవాడ లెనిన్ సెంటరులో వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ జరిగింది. సోమవారం నాడు ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై విరుచుపడడాన్ని ఖండిస్తూ కొద్దిసేపు లైట్లు ఆఫ్ చేసి సెల్‌ఫోన్ లైట్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశ్న పత్రాల లీకేజిపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పట్ల పోలీసుల దాష్టీకం అత్యంత దారుణమన్నారు. విద్యార్థులపై ఉక్కు పాదం మోపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువకుల న్యాయమైన డిమాండ్లకు అనేక పార్టీలు మద్దతు తెలిపితే రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న టిడిపి, వైసిపి మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. దేశంలో జరుగుతున్న అరాచకాలను పార్లమెంట్‌లో అన్ని పార్టీలూ అడ్డుకుంటుంటే, రెండు పార్టీలు మౌనం వహిస్తున్నాయని వివరించారు. మోడీ నిరంకుశ పాలనపై ప్రజలంతా గళం విప్పాలని, బిజెపి దుష్టపాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ లాఠీలు, అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, లాఠిఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ మౌనం దేశానికి ప్రమాదకరమన్నారు. ఈ సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్.బాబూరావు, వామపక్ష పార్టీల నాయకులు ప్రసాదరావు, ఈశ్వర్, సుందరరాజు, ఖదర్ బాషా, అమర్‌నాథ్ తదితరులు ప్రసంగించారు.








కామెంట్‌లు (0)