- ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంట్రాక్టు వైద్య ఆరోగ్య ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటి(జెఎసి), అనుబంధ సంఘాలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. అత్యవసర, ప్రసూతి, ఐసీయూ, శస్త్రచికిత్స విభాగాలతో పాటు అన్ని కీలక వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ సంచాలకులు కెవిఎన్ చక్రధర్‌బాబు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదివారం ఆదేశించారు.
ఆందోళన కారణంగా సిబ్బంది కొరత ఏర్పడితే అర్హత, నిబంధనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న రెగ్యులర్ సిబ్బందిని తాత్కాలికంగా విధుల్లో వినియోగించుకోవాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఎంఎల్‌హెచ్‌పీలు, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఎంపీహెచ్‌ఏ (ఎఫ్) సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఫార్మసీ, ప్రయోగశాల, ఇతర పారామెడికల్ విభాగాల్లోనూ అర్హత కలిగిన సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని వైద్య విద్య సంచాలకులు విష్ణువర్ధన్ ఆదేశించారు. వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.







కామెంట్‌లు (0)