సర్క్యులర్‌పై సిహెచ్.నర్సింగరావు ఆగ్రహం
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల సమాచార హక్కుకు భంగం కలిగిస్తూ ఈ నెల పదిన జారీచేసిన సర్క్యులర్లపై సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ... విశాఖ స్టీల్‌కు సంబంధించిన సమాచారాన్నీ ప్రెస్, మీడియా, విలేకరులకు షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హెచ్చరించడం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ సర్య్కులర్ ద్వారా కార్మికుల నోరు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 15న దేశ ప్రజలంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయంలో స్టీల్ యాజమాన్యం కార్మికుల ప్రజాతంత్ర హక్కులకు భంగం కలిగించే ప్రకటనలు చేయడం యాజమాన్య నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. విశాఖ స్టీల్ సమాచారంపై 40 సంవత్సరాల నుంచి లేని ఆంక్షలు నేడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కార్మికులకు రూ.900 కోట్లమేర జీతాలు బకాయిలు ఉన్నాయని, యాజమాన్యం తన వద్ద ఉన్న రూ.900 కోట్ల రిజర్వు నిధులు ఉంచుకొని బకాయిలు చెల్లించడం లేదన్నారు. తక్షణం కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నైపుణ్యం గల నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించిందని ఆరోపించారు. జూన్ ఎనిమిదిన జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి చెల్లించే వరకూ మీడియాకు విషయాలు చెబుతూనే ఉంటామని, ఇది తమ హక్కు అని అన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల పోరాటాన్ని, ప్రజాతంత్ర హక్కులను అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైందని, అలాంటిది విశాఖ స్టీల్ యాజమాన్యం ఎంత ? అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో విశాఖ స్టీల్ లాభాలు సాధిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు పదేపదే తప్పుడు ప్రచారాన్ని వెదజల్లుతున్నారన్నారు. స్టీల్ యాజమాన్యం ఈ నెల 10న జారీ చేసిన సర్క్యులర్లును వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.







కామెంట్‌లు (0)