గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇది తొలి విజయం

1 గంట క్రితం

ఎమ్మెల్యేల క్యార్టర్స్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • స్టీలు బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సిఎం చంద్రబాబునాయుడు

  • అమరావతిని దేశం మెచ్చే రాజధానిగా నిర్మిస్తామని ప్రకటన

  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు ప్రభుత్వానికి అప్పగింత

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భవిష్యత్‌ నగరాన్ని నిర్మించాలనే తన విజన్‌‌కు అమరావతిలో తొలి విజయం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ - మంగళగిరి - గుంటూరులతో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని , దానిని అనుసంధానించేలా బకింగ్ హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ఆయన గురువారం ప్రారంభించారు. ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆవిష్కరించారు. రాయపూడి నుంచి వెంకటపాలెం- పెనుమాక మీదుగా ఉండవల్లి వరకూ సీడ్ యాక్సెస్ రహదారిని సిఆర్‌‌డిఎ నిర్మించింది. స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రహదారిని సిఎం కాలినడకన తిరిగి ఆసాంతం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతుల త్యాగం స్ఫూర్తి దాయకమని అన్నారు. భవిష్యత్‌ ‌తరాలను దృష్టిలో పెట్టుకుని ఒక విజన్‌‌తో అమరావతి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. సీడ్ యాక్సెస్‌ ‌రహదారి రాజమార్గంగా మారిందని అన్నారు. ఐదు కాన్సెప్టులతో దేశం మెచ్చిన రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని చెప్పారు. అమరావతి బృహత్ ప్రణాళికను సింగపూర్ ఉచితంగా ఇచ్చి సహకరించిందన్నారు. ప్రభుత్వ కాంప్లెక్సు భవనాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రముఖ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయించినట్లు తెలిపారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలకూ అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు చేశామని అన్నారు. అసెంబ్లీలో రాజధానికి 40 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి తర్వాత మూడు రాజధానులని మాట తిప్పేశాడని ప్రతిపక్ష నేత జగన్‌‌మోహన్‌ రెడ్డి నుద్దేశించి అన్నారు

2019-24 మద్య రైతుల ఉద్యమాన్ని చరిత్ర మర్చిపోదని అన్నారు. నో పోల్స్, బ్లూ, గ్రీన్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం డీప్ టెక్ లాంటి ఐదు కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోందని అన్నారు. అమరావతి, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయని చెప్పారు.

190 కిలోమీటర్ల అవుటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. రాజధాని లో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని, ఈ తరహా వ్యక్తులతో రాష్ట్రానికి చాలా ప్రమాదమని హెచ్చరించారు. రాష్ట్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిని నిర్మించే బాధ్యతను తనకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి సరికొత్త శోభ వచ్చిందని అన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉండటం, రైలు, రోడ్డు మార్గాల పరంగా మంచి అనుసంధానం ఉండటం రాజధాని ఎంపికకు ప్రధాన కారణాల్లో ఒకటని మంత్రి వివరించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ‌మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధాని అనే ఉద్దేశంతో జనసేన పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. అంతకుముందు రైతులు లక్ష్మారెడ్డి నాగేశ్వరరావు కూడా మాట్లాడారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల పరిశీలన

రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను సిఎం పరిశీలించారు. భవనాలన్నీ కలియతిరిగారు. పైన ఏర్పాటు చేసిన వ్యూపాయింట్‌ ‌నుండి రాజధాని నిర్మాణ పనులను చూశారు. మంత్రులు, అధికారులను అడిగి నిర్మాణ పనుల తీరును తెలుసుకున్నారు. సిఎం మంత్రి నారాయణ టవర్లలో ఉన్న సదుపాయాలను వివరించారు. అనంతరం మోడల్‌గా పూర్తిచేసిన ఒక ప్లాట్లో కూర్చుని మంత్రులతో కలిసి కాఫీ తాగారు. నిర్మాణ తీరును అభినందించారు. అక్కడ నుండి నేరుగా సెక్రటేరియట్‌‌కు చేరుకున్నారు. సాధారణ పరిపాలనశాఖకు భవనాలు అప్పగించారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్