గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసోషలిజమే ప్రత్యామ్నాయం

1 గంట క్రితం

cuba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కాస్ట్రో ఆశయాలతో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను బలోపేతం చేయాలి

  • ఫైడెల్‌ కాస్ట్రో శతజయంతి సభలో వామపక్ష నేతల పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

నేడు మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సోషలిజమే ప్రత్యామ్నాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఫైడెల్‌ కాస్ట్రో ఆశయాలను నేటి యువతరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని లెనిన్ సెంటర్ లో కాస్ట్రో శత జయంతి సభను ప్రజాశక్తి, విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ఎడిటర్‌ గడ్డం కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కాస్ట్రో రచించిన వ్యాసాలతో కూడిన ‘స్ఫూర్తి’ పుస్తకాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆవిష్కరించారు. కాస్ట్రో చిత్రపటంతో వున్న క్యాలెండర్‌‌ను వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాశక్తి బుక్‌‌హౌస్‌ ‌మేనేజర్‌ కె లక్ష్మయ్య, ‌విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ‌మేనేజర్‌ ‌మనోహార్‌ ‌నాయుడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలో సామ్రాజ్యవాద దోపిడీని అరికట్టి, ప్రజలకు విముక్తి, శాంతి అందించాలనే ఆకాంక్ష బలంగా ఉందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా సాగించిన పోరాటం ప్రపంచ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు లేని దేశాలు సైతం అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు.చిన్న దేశమైన క్యూబా వందకుపైగా దేశాలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ, ప్రకృతి విపత్తులు, కరువు వంటి సందర్భాల్లో ఇతర దేశాలకు సహాయం అందించిందన్నారు. కరోనా సమయంలో ఆ దేశం మానవత్వంతో అనేక దేశాలకు సహాయపడిందని తెలిపారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన క్లిష్ట సమయంలోనూ క్యూబా సోషలిజాన్ని నిలబెట్టుకుందని అన్నారు. క్యూబా ప్రజలను సోషలిజం వైపు చైతన్యపరిచడంలో ఫైడల్‌ కాస్ట్రో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో క్యూబా అనుసరిస్తున్న విధానాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయ‌న్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచిందన్నారు. కాస్ట్రోను హత్య చేసేందుకు అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 సార్లు ప్రయత్నించిందని విమర్శించారు. దేశంలో ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోందని విమర్శించారు. ప్రశ్నించే వారి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నచిన్న తప్పుల పేరుతోనూ ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఓట్లు కొనుగోలు చేయడానికి అధికంగా డబ్బు ఖర్చవుతోందని, ఓట్లను తొలగించడం ద్వారా ఆ ఖర్చును తగ్గించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను కుదించి ప్రజలపై భారాలు మోపే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కాస్ట్రో ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. క్యూబాలో ఎవరికి ఎంత చదువు కావాలో అంత అందిస్తుందన్నారు. కరోనా సమయంలో క్యూబా ప్రపంచానికి వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయి పాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ పి ప్రసాద్‌, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ బంగర్రావు, సిపిఐ(ఎంఎల్‌) జె కిషోర్‌బాబు, (ఎంఎల్‌)ఎన్‌డి ఎం రామకృష్ణ, ఎంసిపిఐ(యు) కె.నాగభూషణ, ఎస్‌‌యుసిఐ (యు) గోవిందరాజులు, ఆర్‌ఎస్‌పి నుంచి జానకీ రాములు, సిపిఐ నుంచి జి.కోటేశ్వరరావు మాట్లాడారు. ఉభయ ప్రజానాట్యమండలి నాయకులు అనిల్‌, చంద్రనాయక్‌, జగన్‌, శర్మ, పిచ్చయ్య ఆలపించిన గీతాలు సభికులను ఉత్సహాపరిచాయి. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్