ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తొలి దశలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.
తొలి దశలో 17 మంది మేయర్లు, 106 మంది మున్సిపల్ ఛైర్మన్లతో పాటు 3,884 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు, 661 జడ్‌పిటిసి, ఎంపిపిలు, 9,913 ఎంపిటిసి పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో దశలో 13,351 మంది సర్పంచులు, 1,33,910 మంది పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ నెల 12న నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌పై ప్రకటన చేసే అవకాశం ఉంది.






కామెంట్‌లు (0)