ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదల ఇళ్లకు పైకప్పు మార్చుకునే హక్కు కూడా లేదా : సిహెచ్ బాబురావు

4 గంటల క్రితం

Ch. Babu Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 05:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : పేదల ఇళ్లకు పైకప్పు మార్చుకునే హక్కు కూడా లేదా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న కరకట్టపై కోట్లాది రూ.. వ్యయంతో నిర్మాణాలు చేపుడుతున్న ప్రభుత్వం, పేదలు నివాసం ఉండే విజయవాడ కరకట్టపై చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. కృష్ణలంక రణదివేనగర్ కరకట్ట ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు, అవుట్ ఫాల్ డ్రైన్, స్థానిక సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. 50 ఏళ్ళుగా సొంత కష్టార్జితంతో నివాసం ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్న కృష్ణా కరకట్ట ఇళ్ళకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలనికోరారు. ఇళ్ళ పై కప్పు మార్చుకునే హక్కు కూడా ప్రజలకు లేదా అని నిలదీశారు. ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం కృష్ణా కరకట్ట నివాస ప్రజలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడిచినా ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని అన్నారు. ️ప్రజలు పోరాటానికి సిపిఎం అండగా నిలబడిందని, సుదీర్ఘ పోరాటం తర్వాత రక్షణగోడ కృష్ణా కరకట్టపై రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరిగిందని, ఇది ప్రజా పోరాటం వలన సాధించిన ఫలితమని అన్నారు. ️రిటైనింగ్‌వాల్ నిర్మాణం తర్వాత కృష్ణా కరకట్ట ఇళ్ళకు రక్షణ వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది, అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. ఒక్క సంతకంతో ఇళ్ళ పట్టాలు ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని నిలదీశారు.

️ముఖ్యమంత్రి చంద్రబాబు, వారి కుమారుడు లోకేష్ నివాసం ఉంటున్న రాజధాని వైపు ఉన్న కృష్ణా కరకట్ట ఇళ్ళకు, ఆ కరకట్టపై ఉన్న బంగ్లాలకు పట్టాలు ఉన్నాయి, కానీ విజయవాడలో ఉన్న వేల ఇళ్ళకు మాత్రం పట్టాలు ఎందుకు ఇవ్వరని మండిపడ్డారు. ️కృష్ణా నది మధ్యలో కోట్ల రూపాయల 130 ఎకరాల భవానీ ఐలాండ్ స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా కట్టబెట్టే ప్రభుత్వం, పేదల ఇళ్ళకు పట్టాల అంశంలో మౌనం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారం చేసుకోవడానికి లీజుకు ఇవ్వడానికి చంద్రబాబుకి చేతులొచ్చాయి, కానీ 50ఏళ్ళుగా నివాసం ఉంటున్న కృష్ణాకరకట్ట ప్రజల ఇళ్ళకు పట్టాలు ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదని అన్నారు. ️రాష్ట్రంలో అందరికీ ఇళ్ళు ఇస్తాం, రెండు సెంట్లు, మూడు సెంట్లు అని హామీలు ఇచ్చారని, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, కూటమి ప్రభుత్వం అందరికీ ఇళ్ళ నినాదాలు ప్రచార ఆర్భాటాలుగా మాత్రమే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఎవరి ఖర్చుతో వారు ఇళ్ళు నిర్మించుకుని నివాసం ఉంటున్న వాళ్ళకు పట్టాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వేల కోట్లతో ప్రక్కనే అమరావతి కడుతున్నాం అంటున్నారు, కానీ ప్రక్కనే ఉన్న కృష్ణా కరకట్ట రిటైనింగ్‌వాల్ ప్రక్కన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టలేకపోయారని అన్నారు. ️అవుట్‌ఫాల్ డ్రైన్ లేకపోవడం వలన మురుగు నిలిచిపోయి, చెత్త పేరుకుపోయి స్థానికులు తీవ్ర అవస్తలు పడుతున్నారని, దోమలు పెరిగి ఆరోగ్యం దెబ్బతిని రోగాల భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏళ్ళుగా నిలిచిపోయిందని, ఇంటి పన్నులు లేవని, అనేక సమస్యలు ఉన్నా పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. ️ఓట్లు వేయించుకోవడంపై ఉన్న దృష్టి ప్రజలు పడుతున్న సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధి ఇక్కడ 12ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారని, అయినా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. రెండవ శ్రేణి పౌరులుగా ఎందుకు చూస్తున్నారని, వరద ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ️కృష్ణాకరకట్ట ప్రజల తరపున సిపిఎం పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పి.కృష్ణ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కోరాడ రమణ, స్థానిక నాయకులు తాడి రమణ, శ్రీరాములు, బెవర శ్రీను, అప్పలనాయుడు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్