ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి

3 గంటల క్రితం

cpm prasna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 06:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్

ప్రజాశక్తి - విజయవాడ : : యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై అత్యంత నిరంకుశ ఉపా చట్టం కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని సిపిఎం రాష్ట్ర కమిటీ తెలిపింది. దీనికి ఎలాంటి ప్రాతిపదిక లేదని, గన్నవరం పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఏలూరులో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రిని అనుకరిస్తూ రావణ్‌ మాట్లాడిన ఉపన్యాసంపై పెట్టిన వరుస కేసుల్లో కోర్టులు బెయిల్‌ ఇస్తుండడంతో ప్రమాదకరమైన ఉపా చట్టం కింద కేసు పెట్టడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. జనసేన నేత, రోడ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గరికపాటి శివశంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయినందున ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఈ వ్యవహారం జరిగివుండదన్నారు. 7 సంవత్సరాలలోపు శిక్ష వర్తించే కేసులకు కోర్టులు బెయిల్‌ ఇస్తుండడంతో దానికి ఎలాంటి అవకాశం లేకుండా 10 సంవత్సరాలకు పైబడి శిక్ష వర్తించే రాజద్రోహం, ఉపా లాంటి అక్రమ కేసులు పెట్టడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. కేసులతో విమర్శకుల గొంతునొక్కాలనుకోవడం నిరంకుశమని పేర్కొన్నారు.

ఉపాధిహామీ చట్టం రద్దు కావడంతో కూలీలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, కనీస వేతనాలు అందక కార్మికులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ప్రభుత్వం పట్ల తమ నిరసనలను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం రావణ్‌ సమస్య చుట్టూ తిరగడం కూటమిలోని కొద్దిమంది నేతలను సంతృప్తి పరుస్తుందేమో కాని ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చదని తెలిపారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజద్రోహ నేరం చట్టం కింద దేశవ్యాపితంగా అనేకమంది సామాజిక, హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి నోర్లు నొక్కుతున్నారని పేర్కొన్నారు. అదే తరహాలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఈ రకమైన అక్రమ, దుర్మార్గ చర్యలను ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు ఖండించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్