బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభూసేకరణ పరిహారం లెక్కింపులో మార్పులకు ముసాయిదా

1 గంట క్రితం

ap cs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 10:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భూసేకరణ పరిహారం లెక్కింపులో గ్రామీణ ప్రాంతాలకు వర్తించే గుణకాన్ని (మల్టిఫ్లికేషన్‌ ‌ఫ్యాక్టర్‌) సవరించేందుకు ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో షెడ్యూల్ కాని ప్రాంతాలకు 1.25, షెడ్యూల్ (గిరిజన) ప్రాంతాలకు 1.50 గుణకం ఆధారంగా పరిహారం లెక్కిస్తున్నారు. తాజా ముసాయిదా ప్రకారం, పట్టణ స్థానిక సంస్థ సరిహద్దుల నుంచి భూమి ఉన్న దూరాన్ని బట్టి గుణకాన్ని నిర్ణయించనున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. పట్టణ సరిహద్దులకు 2 కిలోమీటర్లలోపు ఉన్న భూములకు గుణకం 1.05, 2 నుంచి 5 కిలోమీటర్ల మధ్య ఉన్న భూములకు 1.10 గుణకం, 5 కిలోమీటర్లకు పైగా ఉన్న భూములకు 1.25, షెడ్యూల్ (గిరిజన) ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్నట్లుగానే 1.50గా కొనసాగుతుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భూసేకరణ కేసులపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సవరణలను ప్రతిపాదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ముసాయిదాపై ప్రజలు, సంబంధిత వర్గాలు 15 రోజులలోపు తమ అభ్యంతరాలు లేదా సూచనలను ప్రభుత్వానికి పంపొచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తుది నిబంధనలను ప్రభుత్వం ప్రకటించనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్