శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్ల సొమ్ముతో తాగుతున్నారు

2 గంటల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నిధులు వృధా చేస్తున్నారు

  • కలెక్టర్ల సమావేశంలో సిఎం చంద్రబాబు వ్యాఖ్య

  • రేషన్‌, పింఛన్‌ కోసం విడిపోతున్నారు

  • ఉమ్మడి కుటుంబాలను విచ్ఛిన్నం చేయొద్దు

  • రేషన్‌ కార్డులకు కొత్త పాలసీ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రతినెలా వివిధ తరగతులకు ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలతో పంపిణీ చేస్తున్న సామాజిక భద్రతా పింఛన్‌ ‌సొమ్ముతో తాగుతున్నారని, నిధులు వృధా అవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన శుక్రవారం సూపర్‌‌సిక్స్‌, సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా సిఎం ఈ వ్యాఖ్యలు చేశారు... ‘ఇప్పటి వరకు సంక్షేమానికి ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయగా, వాటిలో ఒక్క పింఛన్లకే రూ.75 వేల కోట్లిచ్చాం. ఆ సొమ్ముతో కొంత మంది తాగుతున్నారు. వృధా చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటవ తేదీన పంపిణీతోనే సరిపోదు. సాయంత్రం వెళ్లి సొమ్మును ఏం చేస్తున్నారో పరిశీలించాలి. పెన్షన్లతోపాటు ఇతర నగదు బదిలీ పథకాలతో కుటుంబాలు సాధికారత సాధించేలా చూడాలి’ అని చంద్రబాబు చెప్పారు. కొత్త పింఛన్ల దరఖాస్తుల అంశంపై జోక్యం చేసుకుంటూ... కొత్తవి మంజూరు కాకముందే కుటుంబాలను మ్యాపింగ్‌ ‌చేయాలి. కుటుంబాన్ని నిర్ధారించి నిర్వచించాలి. ఒక కుటుంబానికి ఒక బెనిఫిట్‌ అనే విధానం అమలు చేయాలి. ఉన్న వాటిని అలాగే కొనసాగిస్తూనే కొత్త వాటికి ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి.. అని ఆదేశించారు.

రేషన్‌, పింఛన్‌ ‌కోసం విడిపోతున్నారు

రేషన్‌, పింఛన్‌, ఇతర సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు విడిపోతున్నాయని సిఎం చెప్పారు. ప్రస్తుతం రేషన్‌‌పై సీలింగ్‌ ఉంది. ఒక్కొక్కరికి 5 కిలోలు వస్తుండగా, కుటుంబంలో నలుగురికంటే ఎంత మంది ఉన్నా 20 కిలోలే అందుతోంది. నలుగురికంటే ఎక్కువ మంది ఉండే కుటుంబాలు రేషన్‌ ‌కోసం విడిపోతున్నాయి. అవసరమైతే ఎంత మంది ఉంటే అంత మందికీ 5 కిలోల చొప్పున రేషన్‌ ఇచ్చే విషయంపై ఆలోచించండి. ఏడుగురు ఉంటే 35 కిలోలు ఇవ్వండి. అంతేకాని కుటుంబాలను మనమే విడగొట్టే పని చేయొద్దు. ఉమ్మడి కుటుంబం కాన్సెప్టును అమలు చేయాలి... అని చెప్పారు. కొత్తగా పెళ్లయిన వారికి కొత్త కార్డులివ్వాల్సి ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ‌తెలపగా ... మొత్తానికే రేషన్‌ ‌కార్డుల జారీపై కొత్త పాలసీని రూపొందించాలని సిఎం ఆదేశించారు.

ఎస్‌‌టి ధృవీకరణ పత్రాల జారీకి ఇబ్బంది

కొన్ని చోట్ల ఎస్‌‌టి కుల ధృవీకరణ పత్రాల జారీకి ఇబ్బందులొస్తున్నాయని అధికారులు సమావేశం దృష్టికి తీసుకురాగా సాధ్యమైన మేరకు సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ఆ కులాలకు ఇబిసి కేటగిరీ కింద పరిగణించి ఎస్‌‌టిలకు అందే అన్ని సదుపాయాలనూ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో ‘యానాటికొండ’ సామాజిక తరగతికి ఎస్‌‌టి కుల సర్టిఫికెట్ల అంశం దశాబ్దాలుగా సమస్యగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలపగా... ఎస్‌‌టిలో చేర్చే అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని, ఆ లోపు బుడగ జంగాలకు మాదిరిగానే యానాటికొండ సామాజిర తరగతి వారికీ ఇబిసి కింద ఎస్‌టిలకు వచ్చే అన్ని సంక్షేమ సదుపాయాలనూ అందించాలని సిఎం అన్నారు.

మొక్కుబడిగా పి-4

నిరుపేదలకు ఆర్థికంగా చేయూతనందించే ‘పి-4’ ను కలెక్టర్లు మొక్కుబడి కార్యక్రమంగా మార్చేశారని, మొత్తానికే నీరుగారే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి అసహనం వెలిబుచ్చారు. ఒక ఉద్యమంలా చేయాలని సూచించారు. సమాజంలో అసమానతలు తగ్గించడం ‘స్వర్ణాంధ్ర విజన్‌ 2047’ లక్ష్యమని, పి-4ను మనసుపెట్టి చేయాలని కోరారు. కొన్ని జిల్లాల్లో హాస్టళ్లు, కాపు సహా పలు సంక్షేమ భవనాలకు నిధులు, భూమి కొరత ఉందని అధికారులు తెలపగా.. బడ్జెట్‌ ‌కేటాయించి ఖర్చు చేయకుండా మిగలి ఉన్న నిధులను, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమైన వాటికి ఖర్చు చేసి పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నెలలో కలెక్టర్లు సంక్షేమ క్యాలండర్‌ ‌అమలు చేయాలన్నారు. మొదటి వారం మొదటి రోజున వెల్ఫేర్‌‌డే, రెండవ వారం తొలి రోజు మీ భూమి-మీ హక్కు, మూడవ వారంలో స్వచ్ఛాంధ్ర, నాల్గవ వారంలో సంజీవని కోసం ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్