ప్రజాశక్తి-శింగరాయకొండ: శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై న్యాయపోరాటం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తౌసిక్ తల్లి మౌలాబీ (40) చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. శింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో ఫిబ్రవరి 14న విద్యార్థి తౌసిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ బిడ్డ చావుకు కారణమైన కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సదరు హాస్టల్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ తౌసిక్ తల్లి మౌలాబీ గత 15 రోజులుగా స్కూల్ ముందు తీవ్ర పోరాటం చేస్తున్నారు. న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలాబీ, గురువారం మధ్యాహ్నం పాఠశాల ప్రాంగణం ముందే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
మౌలాబీ పురుగుల మందు తాగిన వెంటనే గమనించిన స్థానికులు, బంధువులు ఆమెను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో శుక్రవారం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె మరణించారు.
కళ్లముందే కొడుకును కోల్పోయి, న్యాయం కోసం నిరసన తెలుపుతూ తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.







కామెంట్‌లు (0)