- భద్రతా పర్యవేక్షణకు సాంకేతిక హంగులు
- 4 కి.మీ. పరిధిలో వైమానిక నిఘా
ప్రజాశక్తి-పీలేరు: రైల్వే పరిధిలో భద్రతా నిఘాను మరింత పటిష్టం చేసేందుకు పీలేరు రైల్వే స్టేషన్‌లో గురువారం డ్రోన్ ఫ్లైట్ ప్రదర్శనతో పాటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్ డివిజన్ ఆర్‌పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్ కుమార్ జైస్వాల్, రేణిగుంట ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రవి శంకర్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రవి శంకర్ సిబ్బందికి డ్రోన్ ఆధారిత వైమానిక నిఘా ప్రాధాన్యత, రైల్వే పరిధిలో భద్రతా పర్యవేక్షణ, అనుమానాస్పద కదలికల గుర్తింపు, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ వినియోగం తదితర అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా భద్రతా నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. పాకాల ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ రాంబాబు సిబ్బందికి డ్రోన్ నిర్వహణ, ఆపరేషన్, భద్రతా నిఘాలో దాని వినియోగంపై ప్రాయోగిక శిక్షణ అందించారు. హెడ్ కానిస్టేబుల్, డ్రోన్ పైలట్ నారాయణ డ్రోన్‌ను ఎగురవేసి దాని పనితీరు, సామర్థ్యాలు, వినియోగ విధానాన్ని సిబ్బందికి ప్రత్యక్షంగా వివరించారు.
4 కి.మీ. పరిధిలో వైమానిక నిఘా...
సుమారు 4 కిలోమీటర్ల పరిధిలో నిఘా నిర్వహించగల సామర్థ్యం కలిగిన డ్రోన్‌తో రైల్వే ట్రాక్‌లు, స్టేషన్ పరిసరాలు, సర్క్యులేటింగ్ ఏరియా, సున్నితమైన ప్రాంతాలు, సాధారణంగా పర్యవేక్షించడం కష్టమైన ప్రదేశాలపై కూడా వైమానిక నిఘా చేపట్టవచ్చని అన్నారు. దీని ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, నేరస్తుల సంచారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నేర ముఠాల కదలికలు, ఇతర అక్రమ కార్యకలాపాలను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రోన్ నిఘా వ్యవస్థ వినియోగంపై ప్రయాణికులు, రైల్వే పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. రైల్వే పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించి భద్రతా చర్యలకు సహకరించాలని అధికారులు కోరారు.
మరిన్ని స్టేషన్లకు డ్రోన్ నిఘా...
ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇప్పటికే డ్రోన్ నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని, దశలవారీగా ఇతర స్టేషన్లకు కూడా ఈ సాంకేతికతను విస్తరించనున్నట్లు ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. డ్రోన్ నిఘాతో రైల్వే భద్రత మరింత పటిష్టం కానుందని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)